పిల్లలు ఆకలితో బడికి వెళ్లొద్దు: శ్రీధర్ బాబు

కలం, కరీంనగర్ బ్యూరో: పిల్లలు ఆకలితో పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని, ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు. సోమవారం మంథనిలో సింగరేణి సంస్థ సీఎస్‌ఆర్ నిధులు రూ.7.5 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద ఇచ్చిన ‘10 మైళ్ల పరిధిలో ఒక్కరూ ఆకలితో ఉండకూడదు’ అనే సందేశం తమ ప్రభుత్వానికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో కొడంగల్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన అల్పాహార పథకం ద్వారా విద్యార్థుల హాజరు శాతం 21 శాతం పెరిగిందని తెలిపారు. మంథని సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా విద్యార్థులకు ప్రతిరోజూ వివిధ రకాల అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. వారానికి మూడు రోజుల పాటు విద్యార్థులకు పాలు అందించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అధ్యయనాల్లో విద్యాశాఖ కార్యక్రమాల అమలులో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు. ఉపాధ్యాయుల నియామకంతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను నిశ్చింతగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ కోరారు.

సబ్‌స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం ప్రారంభం

అనంతరం మంథని మండలం గంగాపురి వద్ద రూ.2.55 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను, కమాన్‌పూర్ మండలంలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు.ధరణి పోర్టల్‌లో ఉన్న లోపాలను సరిదిద్ది ‘భూ భారతి’ ద్వారా భూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నామని మంత్రి తెలిపారు. తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో భూ రీ-సర్వే చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మంథని ఆర్డీవో సురేష్, మున్సిపల్ చైర్మన్ వి. శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఆర్‌జీ-3 జీఎం, తహసీల్దార్లు ఆరిపోద్దిన్, వాసంతి, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>