కరీంనగర్‌లో మున్సిపల్ టెండర్లు రద్దుకు సీపీఐ డిమాండ్

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) మున్సిపల్ కార్పొరేషన్‌లో యుఐడీఎఫ్ నిధులతో చేపట్టబోతున్న పనులకు దాఖలైన సింగిల్ టెండర్లను రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. టెండర్ల ప్రక్రియపై శనివారం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలకు ముందు రూ.50 కోట్లకు టెండర్లు నిర్వహించినా.. వాటికి ఆమోదం లభించకుండా కొందరు కాంట్రాక్టరర్లే  అడ్డుపడ్డారన్నారు. తరువాత అన్ని డివిజన్లకు ప్రాధాన్యమిస్తూ టెండర్లు నిర్వహిస్తే 87 టెండర్లలో 69 పనులకు సింగిల్ టెండర్ మాత్రమే దాఖలైనట్లు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే.. కార్పొరేషన్‌లో అవినీతి అక్రమాలు జరిగే అవకాశం ఉందన్నారు.

ఐఏఎస్ అధికారి కమిషనర్‌గా ఉన్నా అవినీతేనా..?

టెండర్ ప్రక్రియలో పోటీ లేకపోవడంతో ప్రభుత్వానికి నష్టం జరిగే అవకాశం ఉందని పంజాల శ్రీనివాస్ ఆరోపించారు. ఎంతో మంది కాంట్రాక్టర్లు పోటీపడే అవకాశం ఉన్నా, సింగల్ టెండర్ మాత్రమే వేయడం వెనుక ఆంతర్యమేంటో అర్థం కావడం లేదన్నారు. ఐఏఎస్ అధికారి కమిషనర్‌గా ఉన్నా అవినీతి రాజ్యమేలుతుందని.. అధికారులకు మున్సిపల్‌పై పట్టు లేకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే సింగిల్ టెండర్లను రద్దు చేయకపోతే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, టేకు మల్ల సమ్మయ్య, న్యాలపట్ల రాజు, పైడిపల్లి రాజు పాల్గొన్నారు.

Read Also: కరీంనగర్ గడ్డ.. కమలం అడ్డా: బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామచందర్ రావు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>