కలం/ఖమ్మం బ్యూరో : సిపిఐ త్యాగాల చరితకు వందేళ్లు నిండాయని, ఆవిర్భాల నుంచి నిర్బంధాలను ఎదుర్కొంటూ ప్రజల పక్షాన నిలిచిన ఏకైక పార్టీ సిపిఐ మాత్రమేనని పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ (Ramakrishna) తెలిపారు. పోరాటాల పురిటిగడ్డ ఖమ్మంలో సిపిఐ శత వసంతాల ముగింపు వేడుకలు నాలుగు రోజుల పాటు జరగనున్నాయని వివరించారు. జనవరి 18న బహిరంగ సభ, 19న జాతీయ కార్యవర్గం, 20న జాతీయ స్థాయి సెమినార్ జరుగుతాయని రామకృష్ణ తెలిపారు. గురువారం ఖమ్మం సిపిఐ ఆఫీసర్ లో రామకృష్ణ మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రస్తుత పరిస్థితులు వామపక్షం ఉద్యమం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై జనవరి 20న సెమినార్ లో ప్రధాన వామపక్షాల -కార్యదర్శులు ఎంఏ బేబీ, దీపాంకర్ భట్టాచార్య, మనోజ్ భట్టాచార్య సహా ఇతర నేతలు పాల్గొంటారన్నారు.ట్రంప్ బెదిరింపులకు మోడీ భయపడుతున్నాడని ఆయన ఏం చెప్పినా సరే అనడం తప్ప సమాధానం చెప్పలేని స్థితిలో మోడీ ఉండడంతో భారతదేశ విలువలు ప్రపంచ వ్యాప్తంగా పడిపోతున్నాయని రామకృష్ణ (Ramakrishna) విమర్శించారు.వెనెజువెలా అధ్యక్షుడు మధురో ఆయన భార్యను బంధిస్తే కనీసం నోరు విప్పలేని స్థితిలో దేశ ప్రధాని ఉన్నారన్నారు. జల వివాదాలను పరిష్కరించుకోవచ్చునని రెండు ప్రభుత్వాలు కూర్చుని చర్చించుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని అవలంభిస్తుందని విమర్శించారు.
కార్పొరేట్ల కోసమే ‘కగార్’..
కార్పొరేట్ శక్తులకు ఖనిజ సంపదను కట్టబెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ తీసుకు వచ్చిందని రామకృష్ణ ఆరోపించారు. బూటకపు ఎన్ కౌంటర్ల పేరుతో మావోయిస్టులను కాల్చి చంపుతున్నారని ఈ క్రమంలోనే హిడ్మాను కూడా ఆంధ్రప్రదేశ్లో కాల్చి చంపారని ఆయన తెలిపారు. మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, -సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ కె జానిమియా, బిజి క్లెమెంట్, పోటు కళావతి, రామాంజనేయులు, మేకల శ్రీనివాసరావు, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


