కలం, వరంగల్ బ్యూరో: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర (Medaram Jatara) అనగానే వనదేవతలు, గద్దెలు, గిరిజన సంప్రదాయాలతోపాటు బంగారం కూడా గుర్తుకొస్తుంది. భక్తులు వనదేవతలకు బంగారంగా బెల్లం సమర్పించడం ఇక్కడ ఆచారం. అయితే, ఈసారి మేడారంలో బెల్లం ధరకు రెక్కలొచ్చాయి. బహిరంగ మార్కెట్లో కిలో రూ.40 ఉంటే ఇక్కడ మాత్రం కిలో రూ.60 పలుకుతోంది. దీంతో సామాన్య భక్తులకు భారంగా మారింది. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెల్లం ధరలు అదుపులో ఉంచాల్సిన ఆబ్కారీ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన, ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర (Medaram Jatara). మరో ఇరవై రోజుల్లో జాతర ప్రారంభం కానుంది. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, బంగారం ఎత్తుకుని బయల్దేరే భక్తులు.. ఇసుకేస్తే రాలనంత జన సందోహం.. ఇదీ మేడారం జాతర తీరు. ఈ జాతరలో సమ్మక్క సారలమ్మలకు అత్యంత ఇష్టమైన బంగారం (బెల్లం) సమర్పించడం ఆనవాయితీ. కోరికలు తీరితే భక్తులు అమ్మలకు నిలువెత్తు బెల్లం సమర్పిస్తారు. ఈ జాతరకు తెలంగాణతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారు. విదేశీయులూ వస్తారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.
బెల్లం.. బంగారం..
అమ్మవార్లకు మొక్కుల చెల్లింపుల్లో ప్రధానమైనది బెల్లం. కోరిన కోరికలు తీర్చే తల్లులకు ఎత్తు బంగారం సమర్పిస్తామని మొక్కుకుంటారు. ఆ ప్రకారం మొక్కు చెల్లిస్తారు. సమ్మక్క పున్నం( పౌర్ణమి) నుంచి మొదలు జాతర వరకు బెల్లం సమర్పిస్తారు. దీంతో జాతరలో నెల రోజులు బెల్లం వ్యాపారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో వరంగల్ ప్రాంతానికి భారీగా బెల్లం దిగుమతి అవుతోంది. పాత బీట్ బజార్ నుంచి మేడారానికి బెల్లం తరలిస్తున్నారు. జనగామ, మహబూబాబాద్, పరకాల, వర్ధన్నపేట, స్టేషన్ ఘనపూర్, భూపాలపల్లి, ములుగు, పస్రా, ఏటూరునాగారం ఇతర పట్టణాల్లోనూ బెల్లం అమ్మకాలు జోరుగా సాగుతాయి.
టన్నుల కొద్దీ విక్రయాలు..
తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అంతటా బెల్లం టన్నుల కొద్దీ విక్రయిస్తారు. మామూలు రోజుల్లో సుమారు పది టన్నుల బెల్లం అమ్మకాలు జరిగితే, ప్రస్తుతం 40 నుంచి 50 టన్నుల చొప్పున అమ్మకాలు జరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. రోజుకు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు బెల్లం అమ్ముతున్నట్లు హోల్ సేల్ వ్యాపారులు అంటున్నారు. ఇక చిల్లర ధరతో దాదాపుగా రూ.20 కోట్ల వరకు వ్యాపారం జరుగుతున్నట్లు తెలిపారు.
వ్యాపారులకు పండుగే..
రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర (Medaram Jatara) బెల్లం వ్యాపారులకు పెద్ద పండుగ అని చెప్పాలి. ఎందుకంటే ఏడాదంతా జరిగే వ్యాపారం కేవలం నెల రోజుల్లోనే జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. ఈ నెల రోజుల్లో వ్యాపారం మామూలుగా ఉండదు. కొందరు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి బెల్లం రేట్ నియంత్రిస్తారు. వాళ్లు చెప్పిన ధరకే అమ్మకాలు సాగిస్తారు. హోల్‌సేల్‌గా బెల్లం ధర కిలో రూ.40 వరకు ఉండగా, దానిని మేడారంలో రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో రూ.40 నుంచి రూ.45 వరకు అమ్ముతున్నారు. ఇలా నెల రోజుల పాటు సుమారు 50 లారీల బెల్లం అమ్మకాలతో వ్యాపారం జోరుగా సాగుతుంది.
Read Also: పొంగులేటి ఇంట ఆత్మీయ ‘మాధురి’యం..!
Follow Us On: X(Twitter)


