బక్రీద్ సీజన్‌లో స్కామ్‌లు.. సజ్జనార్ కీలక హెచ్చరిక

కలం, వెబ్ డెస్క్ : బక్రీద్ (Bakrid) పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో గొర్రెలు, మేకల సంతలలో జరుగుతున్న మోసాలపై సీపీ సజ్జనార్ (CP Sajjanar) ప్రజలను అప్రమత్తం చేశారు. నగరంలోని పశువుల మార్కెట్‌లు.. కొనుగోలుదారుల రద్దీతో సందడిగా మారుతున్న ఈ సమయంలో కొందరు కేటుగాళ్లు డిజిటల్ చెల్లింపుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని ఆయన హెచ్చరించారు. ఫేక్ ఫోన్‌పే వంటి నకిలీ యాప్‌లను ఉపయోగించి, నగదు చెల్లించినట్లుగా స్క్రీన్‌పై చూపిస్తూ వ్యాపారులను నమ్మించి జీవాలను తీసుకెళ్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ఇటీవల కంచన్‌బాగ్, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధులలో ఇలాంటి రెండు మోసాలు జరిగినట్లు  వెల్లడించారు.

కంచన్‌బాగ్‌లో ఆరుగురు వ్యక్తులు రూ. 68 వేల విలువైన జీవాలను నకిలీ చెల్లింపులతో తీసుకెళ్లగా, రాజేంద్రనగర్‌లో మరో ఘటనలో నలుగురు వ్యక్తులు రూ. 48 వేల విలువైన గొర్రెలను ఇదే తరహాలో మోసగించి తీసుకెళ్ళినట్లు తెలిపారు. బాధితులు తర్వాత బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేయగా డబ్బు జమ కాలేదని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ సూచించారు. కేవలం ఫోన్‌లో చూపించే స్క్రీన్‌షాట్‌లను నమ్మకుండా, సొంత మొబైల్‌కు వచ్చే బ్యాంక్ ఎస్‌ఎం‌ఎస్  లేదా అధికారిక బ్యాంకింగ్ యాప్‌లో బ్యాలెన్స్ చెక్ చేసుకున్న తర్వాతే జీవాలను అప్పగించాలని సూచించారు. పెద్ద లావాదేవీలకు నగదు చెల్లింపే ఉత్తమమని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>