Mobile Popup Ad
Mobile Popup Ad

భువనగిరిలో రైతుల సమస్యలపై ‘రైతు గోస – బీజేపీ భరోసా’ యాత్ర

కలం, భువనగిరి: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై బీజేపీ పోరుబాట పట్టింది. అందులో భాగంగా ‘రైతు గోస – బీజేపీ భరోసా’ పేరిట ఆ పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా రెండవ రోజు యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలోని భువనగిరి (Bhuvanagiri) మార్కెట్ యార్డ్‌ను బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) నేతృత్వంలో పలువురు బీజేపీ నాయకులు సందర్శించారు. అక్కడ ఉన్న రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నెలకొన్న దారుణ పరిస్థితులపై మార్కెట్ యార్డ్‌లో రైతులు బీజేపీ నేతల వద్ద తమ ఆవేదనను వెళ్లగక్కారు. గత 30 నుండి 40 రోజులుగా ధాన్యం కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నామని, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు.

ధాన్యం రవాణా చేయడానికి కనీసం లారీలు, ట్రాక్టర్లు కూడా అందుబాటులో లేవని, రోజుల తరబడి వాహనాల కోసం ఎదురుచూస్తూ రోజుకు వేల రూపాయల అద్దెలు భరించాల్సి వస్తోందని వాపోయారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలైన గోనె సంచులు (బస్తాలు), టార్ఫాలిన్ కవర్లు కూడా ప్రభుత్వం కల్పించలేదని ఆరోపించారు. తేమ శాతం సాకుతో, తరుగు పేరుతో ఒక క్వింటాల్‌కు సుమారు 3 నుండి 4 కిలోల వరకు కోతలు విధిస్తూ దళారులు, మిల్లర్లు తమను తీవ్రంగా నష్టపరుస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా గాలికొదిలేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో 80 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి చెప్తున్న మాటలు వాస్తవ విరుద్ధమని, క్షేత్రస్థాయిలో కేవలం 25 శాతం లోపే కొనుగోళ్లు జరిగాయని ఆయన స్పష్టం చేశారు.

కావాలనే కొనుగోళ్లను మూడు వారాలు ఆలస్యం చేసి, వర్షాలకు ధాన్యం తడిసిపోయేలా చేసి రైతులను దళారుల చేతుల్లో మోసపోయేలా ఈ ప్రభుత్వం కిరాతకమైన ఆలోచనలు చేస్తోందని ఫైరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం సేకరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని విమర్శించారు. మరోవైపు రోహిణి కార్తె ముగిసి, మృగశిర కార్తె ప్రవేశించనుండటంతో త్వరలోనే ఖరీఫ్ (వానకాలం) సీజన్ సాగు పనులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత పంట ధాన్యం అమ్ముడై, ఆ డబ్బులు చేతికి అందితేనే రైతులు తదుపరి పంటకు పెట్టుబడి పెట్టగలరని, కానీ ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోళ్లు పూర్తి చేయకపోవడం దారుణమని బీజేపీ నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మద్దతు ధర అందించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యేంతవరకు వారి పక్షాన బీజేపీ పోరాటాన్ని కొనసాగిస్తుందని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>