కలం వెబ్ డెస్క్ : సంక్రాంతి(Sankranti) పండుగను ప్రజలంతా ఆనందంగా పతంగులు(kites) ఎగరేస్తూ సెలబ్రేట్ చేసుకోవాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్(Sajjanar) ఆకాంక్షించారు. అయితే ఆ ఆనందం ఎవరి ప్రాణాలకు ప్రమాదంగా మారకూడదని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు సజ్జనార్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. పతంగులు ఎగరేసేందుకు నిర్లక్ష్యంగా వాడే చైనా మాంజా(Chinese Manja) పక్షులకు, వాహనదారులకు యమపాశంలా మారుతోందని ఆయన చెప్పారు. చైనా మాంజాపై ఇప్పటికే సంపూర్ణ నిషేధం అమల్లో ఉందని గుర్తు చేశారు. నైలాన్, గాజు పొడి కలిపిన సింథటిక్ దారాలను అమ్మినా, కొన్నా, వాడినా కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ మాంజా వల్ల పక్షులు తీవ్రంగా గాయపడుతున్నాయని, రోడ్లపై వెళ్లే బైక్ రైడర్లకు మెడకు చుట్టుకుని ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకరి సరదా మరొకరి ఇంట విషాదం నింపకూడదని సూచించారు.
కరెంట్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో పతంగులు ఎగరేయొద్దని సీపీ సూచించారు. పతంగి విద్యుత్ తీగల్లో చిక్కుకుంటే ఇనుప రాడ్లు లేదా తడి చేతులతో లాగేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. అలా చేస్తే కరెంట్ షాక్‌తో ప్రాణాలకు ముప్పు ఉంటుందన్నారు. పిట్టగోడలు లేని డాబాలపై చిన్న పిల్లలను ఒంటరిగా పతంగులు ఎగరేయనివ్వొద్దని తల్లిదండ్రులకు సూచించారు. పతంగులపై దృష్టి పెట్టే సమయంలో పిల్లలు కిందపడే ప్రమాదం ఉందని తెలిపారు. పిల్లలను ఎప్పుడూ కంటికి కనిపించేలా చూసుకోవాలని అన్నారు. చైనా మాంజా విక్రయించే వారిపై, వాడే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని సీపీ సజ్జనార్ వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పర్యావరణ పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కేవలం కాటన్ దారాలతోనే పతంగులు ఎగరేయాలని, మూగజీవాల ప్రాణాలను, మనుషుల భద్రతను కాపాడాలని కోరారు. అందరూ సురక్షితంగా, ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని సీపీ పిలుపునిచ్చారు.


