బక్రీద్ నేపథ్యంలో క‌రీంన‌గ‌ర్‌లో చెక్‌పోస్టుల ఏర్పాటు

కలం, కరీంనగర్ బ్యూరో: రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకొని కరీంనగర్ (Karimnagar) పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, అక్రమ రవాణా నివారణే ధ్యేయంగా సరిహద్దు ప్రాంతాలలో ప్రత్యేక పోలీస్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం (CP Gaush Alam) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చెక్‌పోస్టుల వద్ద నిరంతర నిఘా ఉంచడంతో పాటు విధుల్లో ఉండే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల మౌలిక వసతులు, భద్రతా పరికరాలను సమకూర్చుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే కరీంనగర్ పరిధిలోని మగ్దూంపూర్ చెక్‌పోస్టును సీపీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ లైట్ రిఫ్లెక్టర్ జాకెట్లు, సరిపడా లైటింగ్ వసతి మినహా మిగిలిన రక్షణ పరికరాల కొరత ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందిస్తూ తనిఖీలలో ఎలాంటి అలసత్వానికి తావులేకుండా శనివారం నుండి ప్రతి చెక్‌పోస్టు వద్ద అన్ని రకాల వసతులను విధిగా అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను సీపీ ఆదేశించారు.

ఇకపై ప్రతి చెక్‌పోస్టు వద్ద రాత్రి వేళల్లో తనిఖీల కోసం 3 టార్చ్ లైట్లు, వాహనాలను నిలిపివేసేందుకు, సిబ్బంది రక్షణ కొరకు 3 ఎల్‌ఈడీ బాటన్లు, అత్యవసర అలర్ట్‌ల కోసం సిబ్బంది వద్ద విజిల్స్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. వీటితో పాటు చెక్‌పోస్టుల గుండా వెళ్లే ప్రతి వాహనం, వ్యక్తుల కదలికలను నిరంతరం రికార్డ్ చేసేందుకు వీలుగా 2 సీసీటీవీ కెమెరాలను తక్షణమే ఏర్పాటు చేసి పక్కా నిఘా ఉంచాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో సిబ్బంది సుదూర ప్రాంతాల వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా తగినన్ని లైట్ రిఫ్లెక్టర్ జాకెట్లను ధరించాలని, అత్యవసర సమాచార మార్పిడి కోసం ప్రత్యేక కమ్యూనికేషన్ బేస్ సెట్లను ఇన్‌స్టాల్ చేయాలని సూచించారు. అలాగే చెక్‌పోస్టుల మీదుగా రాకపోకలు సాగించే అనుమానాస్పద వాహనాల వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా రిజిస్టర్లను నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, చట్టవిరుద్ధమైన రవాణాకు అడ్డుకట్ట వేసేందుకే ఈ తనిఖీలను ముమ్మరం చేసినట్లు సీపీ తెలిపారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ప్రజలు, వాహనదారులు చెక్‌పోస్టుల వద్ద విధుల్లో ఉండే పోలీస్ సిబ్బందికి పూర్తి స్థాయిలో సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>