కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పాలమూరు జిల్లాలో ఎత్తిపోతల పథకాలు ప్రారంభించి బీడు భూములను సాగులోకి తేవాలనే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని మాజీ మంత్రులు పేర్కొన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ (BRS) కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించినా, ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. 90శాతం పాలమూరు-రంగారెడ్డి (Palamuru-Rangareddy Project) ప్రాజెక్టు పనులు పూర్తయినా, కేవలం 10 శాతం పనులు పూర్తి చేయడంలో అలసత్వం వహిస్తుందన్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే పాలమూరు దుర్భిక్షంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు ప్రాజెక్టులను త్వరితగితన పూర్తి చేసేందుకే తాము కొల్లాపూర్‌లోని నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు వచ్చే జూన్ నెలలో పాదయాత్ర చేస్తామన్నారు.
అనంతరం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్ట్‌తో దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉన్నా ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. పాలమూరు పూర్తి చేయడం లేదుకానీ. కాళేశ్వరం మీద తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసుంటే రైతులకు ప్రయోజనం కలిగేదని అన్నారు. వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ నుండి డిండి రిజర్వాయర్‌కు నీళ్లు తీసుకువచ్చేందుకు ప్రణాళిక ఉన్నా.. ఆ వైపు దృష్టి సారించడం లేదన్నారు. అనంతరం మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, అంజయ్య యాదవ్, మర్రి జనార్ధన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి, సురభి వాణీ దేవి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస రెడ్డి ఉన్నారు.

