Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ ఉద్యమకారులకు గుడ్ న్యూస్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు (Telangana Govt)  కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి, వారి సేవలు గుర్తించి త్యాగాలను గౌరవించబోతున్నది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం జీఓ విడుదల చేసింది. ఉద్యమంలో కొందరు ప్రాణత్యాగం చేయగా, మరికొందరు శారీరక వైకల్యానికి గురయ్యారు. పలువురిపై కేసులు నమోదై జైలు జీవితం గడిపారు. దీంతో వారి సేవలను అధికారికంగా గుర్తించాలనే చాలాకాలంగా ఉన్న డిమాండ్‌పై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కమిటీ చైర్మన్‌గా కేశవరావు

ఈ కమిటీకి ప్రభుత్వ సలహాదారు కేశవరావు చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎస్ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి నియమితులయ్యారు. సాధారణ పరిపాలనశాఖ పొలిటికల్ సెక్రటరీ ఈ కమిటీకి కన్వీనర్‌గా ఉంటారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ముందుగా స్పష్టమైన ప్రమాణాలను రూపొందించడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. ఆ ప్రమాణాల ఆధారంగా ఉద్యమకారుల జాబితాను సిద్ధం చేస్తుంది. అనంతరం వారికి ఎలాంటి గుర్తింపు, గౌరవం, సౌకర్యాలు కల్పించాలనే అంశాలపై ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుంది.

త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశం

కమిటీ అవసరమైతే అధికారులను పిలిపించుకోవచ్చు. సమాచారం సేకరించవచ్చు. సమావేశాలు నిర్వహించవచ్చు. అవసరమైన ఇతర వ్యక్తులు, అధికారులను కూడా సంప్రదించవచ్చు. కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి వీలైనంత త్వరగా సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు, కార్యదర్శులు కమిటీకి అవసరమైన సహకారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>