కలం, వెబ్ డెస్క్ : కష్టపడి బతుకుదామని వ్యాపారం మొదలుపెట్టిన ఆ జంటను అప్పుల వేధింపులు వెంటాడాయి. చివరికి ప్రాణాలు తీసుకునేలా ఉసిగొల్పాయి. అమ్మానాన్నలు శాశ్వత నిద్రలోకి జారుకోగా, ఏం జరిగిందో తెలియక వారి మూడేళ్ల చిన్నారి పెట్టిన కేకలు ఇప్పుడు బెజ్జంకి గ్రామంలో విషాద ఛాయలు నింపాయి. సిద్దిపేట (Siddipet) జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకున్న దంపతుల ఆత్మహత్య (Couple Suicide) ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది.
దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష (32), రుక్మిణి (25) దంపతులు రెండేళ్లుగా బెజ్జంకిలో నివాసముంటూ బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు. వ్యాపార విస్తరణకు, కుటుంబ పోషణకు శ్రీహర్ష కొంత అప్పు చేశాడు. అంతేకాకుండా, మరికొందరికి మధ్యవర్తిగా ఉండి ఇతరుల వద్ద అప్పులు ఇప్పించాడు. అయితే అప్పులు ఇచ్చిన వారి నుంచి గత కొంతకాలంగా వేధింపులు ఎక్కువవడంతో శ్రీహర్ష తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు.
చిన్నారి కేకలతో వెలుగులోకి..
మనస్తాపానికి గురైన దంపతులు ఆదివారం తెల్లవారుజామున గదిలోనే పురుగుమందు తాగారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న తల్లిదండ్రులను చూసి భయాందోళన చెందిన కుమార్తె హరిప్రియ గట్టిగా కేకలు వేయడంతో ఇంటి యజమాని వచ్చి చూశాడు. అప్పటికే రుక్మిణి మరణించింది. కొన ఊపిరితో ఉన్న శ్రీహర్షను, పురుగుమందు తాగిన ఆనవాళ్లు ఉన్న చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో శ్రీహర్ష కూడా కన్నుమూశాడు. ప్రస్తుతం చిన్నారి హరిప్రియ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
కంటతడి పెట్టిస్తున్న ఆత్మహత్య లేఖ
ఘటనా స్థలంలో శ్రీహర్ష రాసిన ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తనను ఇబ్బంది పెట్టిన వ్యక్తుల పేర్లను ప్రస్తావించాడు. ‘అమ్మా, నాన్న, తమ్ముడు, అత్తమ్మ.. మమ్మల్ని క్షమించండి’ అంటూ రాసిన వాక్యాలు చూసిన వారిని కన్నీరు పెట్టించాయి. సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐ సౌజన్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


