కలం, ఖమ్మం బ్యూరో: కట్నకానుకలు లేవు, మూఢనమ్మకాలు లేవు.. సాంప్రదాయాలకంటే పౌర విలువలకే పెద్ద పీట వేస్తూ ప్రజా స్వామ్య సూత్రాలే పెళ్లి మంత్రాలుగా చట్టంపై గౌరవం, ప్రేమ పై నమ్మకం, రాజ్యాంగం పై ప్రమాణంతో, అగ్ని సాక్షిగా కాకుండా.. అమూల్యమైన రాజ్యాంగం సాక్షిగా ఓ జంట పెళ్లి చేసుకున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా మణుగూరు మండలంలో చోటు చేసుకుంది.
మణుగూరు మండలానికి చెందిన రాజ్ కిరణ్, సామిక ల వివాహం పీవీ కాలనీలోని సింగరేణి కళ్యాణ మండపంలో జరిగింది. సాంప్రదాయ వివాహాలకు బిన్నంగా జరిగిన ఈ పెళ్లి స్థానికంగా చర్చనీయాంశమవ్వడమే కాకుండా పలువురి దృష్టిని ఆకర్షించడం గమనార్హం. సత్తుపల్లి ప్రాంతానికి చెందిన డాక్టర్ కొచ్చర్ల శ్రీనివాస రావు, రిటైర్డ్ హెచ్.ఎం లక్ష్మయ్యలు.. కొత్త జంటకు బాబాసాహెబ్ అంబేద్కర్, గౌతమ బుద్ధుని పోటో ల సాక్షిగా అక్షింతలతో రాజ్యాంగం పై ప్రమాణం చేయించి అనంతరం ప్రమాణ పత్రాలు చదివించి వివాహం జరిపించారు. ఈ వినూత్నమైన వివాహాన్ని వీక్షించిన పలువురు ప్రజాస్వామ్య వాదులు.. వధూవరులను ఆశీర్వదించి, కుల మతాలకు అతీతంగా జరిగిన వివాహాన్ని కొనియాడారు.

