కలం, వెబ్ డెస్క్ : ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి ‘టీ20 ముంబై మహిళల లీగ్’ (MCA T20) కీలక దశకు చేరుకుంది. తొలి సీజన్ కోసం ముగ్గురు స్టార్ క్రికెటర్లను ఐకాన్ ప్లేయర్లుగా ఎంపిక చేస్తూ ఎంసీఏ నిర్ణయం తీసుకుంది. సాయాలీ సత్ఘరే.. సోబో ముంబై ఫాల్కన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. సైమా ఠాకూర్.. థానే స్కై రైజర్స్ జట్టులో చేరింది. హుమైరా కాజీ.. ఆకాశ్ టైగర్స్ తరఫున బరిలోకి దిగనుంది. ఈ ముగ్గురు ఆటగాళ్లకు అంతర్జాతీయ, దేశీయ స్థాయిలో మంచి అనుభవం ఉంది. సాయాలీ, సైమా భారత జట్టులో సభ్యులుగా ఉండగా, హుమైరా ఇండియా-ఏ తరఫున నిలకడగా రాణిస్తోంది.
ఐకాన్ ప్లేయర్ల ఎంపిక లీగ్‌కు బలమైన పునాది వేస్తుందని ఎంసీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ లీగ్ ద్వారా కొత్త ప్రతిభను వెలికితీయడంతో పాటు, దేశీయ క్రికెట్ నిర్మాణాన్ని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ రాజదీప్ గుప్తా మాట్లాడుతూ, అనుభవం కలిగిన ఈ క్రీడాకారులు జట్లకు ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తారని తెలిపారు.
ముంబై టీ20 లీగ్ (పురుషుల), మహిళల లీగ్ రెండింటికీ సంబంధించిన ఆటగాళ్ల వేలం ఈ శనివారం (మే 2) జరగనుంది. జియో హాట్‌స్టార్‌లో ఉదయం 9 గంటల నుండి ఈ వేలం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ వేలం కోసం మొత్తం 2,411 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 2,048 మంది పురుషులు కాగా, 363 మంది మహిళా క్రికెటర్లు ఉన్నారు. పోటీల సమతుల్యత కోసం మహిళల జట్లలో 16 నుండి 18 మందిని ఎంపిక చేయనున్నారు.

