epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

వరుస సెలవుల ఎఫెక్ట్​.. భక్తజన సంద్రంగా ఆలయాలు

కలం,వెబ్​ డెస్క్​ : ఆధ్యాత్మిక క్షేత్రాల్లో భక్తుల కోలాహలం కనిపిస్తోంది. వరుస సెలవులు, వైకుంఠ ఏకాదశి పర్వదినం దగ్గర పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల (Tirumala) నుంచి యాదాద్రి (Yadadri) వరకు అన్ని పుణ్యక్షేత్రాలు భక్తుల రాకతో సందడిగా మారాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

శ్రీవారి దర్శనానికి 30 గంటలు

కలియుగ వైకుంఠం తిరుమల (Tirumala) క్షేత్రం భక్తులతో పోటెత్తింది. వైకుంఠ ఏకాదశికి తోడు వరుస సెలవులు రావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తిరుపతి (Tirupati)లోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దర్శన టికెట్ల కోసం భక్తులు వేల సంఖ్యలో బారులు తీరారు. ప్రస్తుతం క్యూలైన్లు పూర్తిగా నిండిపోవడంతో, టీటీడీ అధికారులు భక్తుల అనుమతిని తాత్కాలికంగా నిలిపివేశారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి సుమారు 30 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత రద్దీ దృష్ట్యా, రేపు ఉదయం 6 గంటల తర్వాతే భక్తులను తిరిగి క్యూలైన్లలోకి అనుమతించనున్నారు. తిరుపతి (Tirupati) ఎస్పీ సుబ్బారాయుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించారు. అలిపిరి వద్ద ఎలాంటి తొక్కిసలాట జరగలేదని, భక్తులకు ఇబ్బంది కలగకుండా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

శ్రీశైలంలో వసతి గృహాల కొరత..

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం (Srisailam)లో భక్తుల సందడి నెలకొంది. మల్లన్న దర్శనం కోసం ఏపీ, తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామివారి సర్వదర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. అయితే, భక్తుల సంఖ్య పెరగడంతో క్షేత్రంలో వసతి గృహాల కొరత ఏర్పడింది. గదులు దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

యాదాద్రిలో నిలిచిపోయిన వాహనాలు..

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది. కొండపైన క్యూలైన్లు నిండిపోగా, కొండ కింద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీనివల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. స్వామివారి సర్వదర్శనానికి ప్రస్తుతం 2 గంటల సమయం పడుతోంది. సెలవు రోజు కావడంతో భక్తుల సంఖ్య పెరుగుతోంది.

వేములవాడ, కొండగట్టులో..

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లు కిలోమీటర్ల మేర సాగుతున్నాయి. దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టే అవకాశం ఉందని ఆలయ వర్గాలు తెలిపాయి. అటు జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో..

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి కూడా భక్తుల తాకిడి పెరిగింది. వరుస సెలవుల కారణంగా ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రమైంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు మంచినీరు, అన్నప్రసాదాల పంపిణీని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలన్నీ భక్తుల జయధ్వానాలతో మార్మోగుతున్నాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>