జూబ్లీ(Jubilee Hills) ఉపఎన్నిక కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌లు అతిరథమహారథులు లాంటి నేతలతో కలిసి వ్యూహాలు రచిస్తున్నాయి. వాటిని వెంటనే అమలు చేస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచార రథాలను ముందు నడిపిస్తున్నాయి. కానీ ఈ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ ఎంట్రీతో కాంగ్రెస్ పన్నిన వ్యూహం బెడిసి కొట్టిందనే చెప్పాలి. ఉపఎన్నికను మూడు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్ఎస్ తన సత్తా చూపించుకోవడానికి అయితే.. కాంగ్రెస్ ఏమో జూబ్లీహిల్స్‌లో పాగా వేయడానికి. దాంతో పాటుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఉపఎన్నికలో ఓడిపోతే ఎలా? అన్న భావన కూడా కాంగ్రెస్‌లో గట్టిగానే ఉంది. అందుకే ఉపఎన్నిక విషయంలో ఆచితూచి అడుగులు ముందుకు వేస్తోంది. కాంగ్రెస్ వేసే ప్రతి అడుగు ఓట్ బ్యాంక్‌ను దృష్టిలో పెట్టుకునే ఉంటుంది.
టికెట్ నుంచి పదవుల వరకు..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ఆ తర్వాత రెండో స్థానంలో మైనారిటీ ఓటర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో బీసీ నేతకు టికెట్‌ను ఇచ్చి.. కాంగ్రెస్ తన తొలి వ్యూహాన్ని సక్సెస్‌ఫుల్‌గా అమలు చేసింది. నవీన్ యాదవ్ అభ్యర్థిగా ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. కానీ ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. నవీన్ యాదవ్ బలమైన అభ్యర్థిగా ఉన్నప్పటికీ అతని చుట్టూ ఉన్న వివాదాలు, రౌడీ ఫ్యామిల అన్న ట్యాగ్.. అతనికి మైనస్ పాయింట్లుగా మారాయి. అందుకే ప్రతి ఓటర్‌ను తమవైపు ఆకర్షించాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. సీఎం రేవంత్‌ను సైతం ఇందులో భాగం చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. సీని వర్గాలతో ‘అభినందన’ సభ పెట్టించింది.
సినీ ఇండస్ట్రీ ఆకట్టుకోవడం కోసం సీఎం
సినీ వర్గాలు నిర్వహించిన ‘అభినందన’ సభలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. అందులో సినీ పరిశ్రమకు సంబంధించి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఆయన హామీలు ఇచ్చారు. నిర్మాతలు, స్టార్ హీరోలను ఆకట్టుకోవడం కోసం టికెట్ రేట్‌ల పెంపుకు ఒక కండిషన్‌తో ఓకే చెప్పారు. అదే కండిషన్‌ను సినీ కార్మికులను ఆకట్టుకోవడానికి మరో అస్త్రంలా వాడారు. టికెట్ రేట్లు పెంచితే వచ్చే లాభాల్లో సినీ కార్మికులకు 20శాతం ఇవ్వాలని, అప్పుడే టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తానని అన్నారు. అంతేకాకుండా కృష్ణానగర్‌లో సినీ కార్మికుల పిల్లల కోసం 3-5 ఎకరాల్లో కార్పొరేట్ స్థాయి పాఠశాలను నిర్మిస్తానని, అందుకోసం స్థలం చూడాలని అన్నారు. ఒకవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా సరే.. దానిని ఏమాత్రం పట్టించుకోకుండా.. జూబ్లీహిల్స్‌లో ఎక్కువగా ఉండే సినీ వర్గాల వారిని ఆకట్టుకునేలా సీఎం రేవంత్ వరాలు కురిపించారు.
నవీన్ యాదవ్ వివాదాలు సృష్టిస్తున్న మైనస్‌ను అధిగమించడం కోసం సినీ కార్మికులతో పాటే ఓటర్ల సంఖ్యలో సెకండ్ ప్లేస్‌లో ఉన్న మైనారిటీలను కూడా ఆకర్షించాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. అందులో భాగంగానే అజారుద్దీన్‌కు మంత్రి పదవి అన్న అంశాన్ని కాంగ్రెస్ తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది. అజారుద్దీన్ ఒక మైనారిటీ నాయకుడు.. అతనికి టికెట్ ఇవ్వకుండా బీసీ నాయకుడికి ఇవ్వడం ముస్లిం ఓటర్లలో కాంగ్రెస్‌కు కాస్తంత మైనస్‌గా మారింది. దాంతో దానిని అధిగమించడం కోసం అజారుద్దీన్‌కు మంత్రి పదవి అన్న ప్రచారాన్ని స్టార్ట్ చేసినట్లు అర్థమవుతోంది. కానీ కాంగ్రెస్ వేసిన ఈ ప్లాన్.. బీజేపీ, బీఆర్ఎస్ ఎంట్రీతో బెడిసి కొట్టింది.
ఎండగట్టిన బీజేపీ, బీఆర్ఎస్
ఎన్నికల కోడ్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా నిబంధనలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వేస్తున్న ప్రతి అడుగును బీజేపీ, బీఆర్ఎస్‌లు ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వస్తున్నాయి. సినీ వర్గాలతో సభ నిర్వహించి, అందులో సీఎం వరాల కురిపించడంపై బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్(Gangula Kamalakar).. తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఇప్పుడు అజారుద్దీన్‌కు మంత్రి పదవి అన్న అంశంపై బీజేపీ నాయకులు.. సుదర్శన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు మంత్రి పదవి ఎలా ఇస్తారు? అని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కూడా స్పందిస్తూ.. జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నిక కోసమే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పూర్తిగా పోయిన పరువును కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ ఈ ప్రయత్నాలు చేస్తోంది. సినీ వర్గాలకు అరచేతిలో వైకుంఠం చూపడం, ఇప్పుడు అజారుద్దీన్‌కు మంత్రి పదవి అనడం వాటిలో భాగమే’’ అని కేటీఆర్ ఆరోపించారు. ఒకవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్.. కాంగ్రెస్‌ను కడిగిపారేస్తుండటంతో కాంగ్రెస్ వ్యూహం బెడిసి కొట్టినట్లయింది.
నిబంధనలను తుంగలో తొక్కుతూ..
ఎన్నికల కోడ్‌ను కాంగ్రెస్ ఎప్పటికప్పుడు తుంగలో తొక్కుతూ వస్తోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు హామీలు ఇవ్వకూడదని, మంత్రివర్గ విస్తరణ చేయకూడదనేవి కాంగ్రెస్‌కు, కాంగ్రెస్ నాయకులకు తెలియని విషయాలేమీ కాదు. ప్రతి నాయకుడు ఎన్నో ఎన్నికలకు ఎదుర్కొన్నవారే. కానీ ఈసారి మాత్రం జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవడం కోసం కాంగ్రెస్.. ఎన్నికల కోడ్ నిబంధనను తుంగలో తొక్కుతూవస్తోంది. అయినా సరే బీజేపీ, బీఆర్ఎస్‌లు కాంగ్రెస్ పన్నాగాలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతుండటంతో కాంగ్రెస్ అయోమయంలో పడిపోయింది. అంతేకాకుండా అజారుద్దీన్‌కు మంత్రి పదవి అనేది కేవలం ప్రచార అస్త్రంగానే కాంగ్రెస్ వినియోగించుకుంటుందని ఆ పార్టీ నేతల మాటలు వింటే అర్థమైపోతోంది.
క్లారిటీ ఇవ్వని భట్టి..
అజారుద్దీన్‌కు మంత్రి పదవిపై కాంగ్రెస్‌కు సంబంధించి ఏ నేత కూడా క్లారిటీగా ఏ విషయం చెప్పడం లేదు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏమో.. తనకు కూడా ఈ విషయం తెలియదని అంటారు. మరోవైపు భట్టి విక్రమార్క.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వకుండా కుట్రలు జరుగుతున్నాయని అంటున్నారు. ‘‘అజారుద్దీన్‌కు మంత్రి పదవి అనగానే బీజేపీ కుట్రలు స్టార్ట్ చేసేసింది. మైనారిటీ నాయకుడు మంత్రి హోదాలో ఉండడాన్ని బీజేపీ తట్టుకోలేకనే ఇలా చేస్తోంది. అందుకే అజారుద్దీన్(Azharuddin)ను కేబినెట్‌లోకి తీసుకోవద్దని లేఖలు రాస్తోంది బీజేపీ. దేశానికే పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన ఆటగాడు అజారుద్దీన్. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వొద్దని లేఖలు రాస్తుండటం మన దురదృష్టకరం’’ అని భట్టి(Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ద్వారా అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తాం అని కానీ, ఇవ్వం అని కానీ భట్టి చెప్పలేదు. ఆయనకు పదవి వస్తుందేమో అని బీజేపీ కంగారు పడుతుందని వ్యంగ్యాస్త్రాలు మాత్రమే సంధిస్తున్నారు. ఏది ఏమైనా అజారుద్దీన్‌కు పదవి అన్న అంశంతో మైనారిటీ ఓటర్లను ఆకర్షించాలన్న కాంగ్రెస్ వ్యూహం.. బీజేపీ, బీఆర్ఎస్ ఎంట్రీతో బెడిసి కొట్టింది.
అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి ఈసీ బ్రేక్
ఈ నేపథ్యంలోనే శుక్రవారం మధ్యాహ్నం.. తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారని వార్తలు వచ్చాయి. దానికి అంతా సన్నద్ధం కూడా చేస్తున్నట్లు తెలిసింది. కాగా దీనికి తాజాగా ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బిగ్ షాకిచ్చారు. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలో స్పష్టత ఇవ్వాలని ఈసీని కోరారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది.
Read Also: మల్కాజ్‌గిరిలో విరిగిపడ్డ కొండచరియలు

