కలం, వెబ్ డెస్క్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరు మార్పు అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతోంది. మహాత్మాగాంధీని కేంద్రం అవమానిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. పేదలకు మేలు చేసే ఈ పథకానికి తూట్లు పొడవాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయబోతున్నది.
పేరు మార్పుపై రాజకీయ దుమారం
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధి హామీ చట్టానికి ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ) అంటూ కొత్త పేరు పెట్టింది. సంక్షిప్తంగా ‘వికసిత్ భారత్, జీ రామ్ జీ. ఈ పేరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహాత్మాగాంధీ పేరును ఉద్దేశపూర్వకంగా తొలగించే ప్రయత్నమేనని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఇది కేవలం పేరు మార్పు కాదని, పథకం స్వరూపాన్నే బలహీనపరిచే కుట్ర జరుగుతున్నదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ఉపాధి హామీ పథకం నేపథ్యం
గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో 2005లో యూపీఏ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని(MGNREGA) అమల్లోకి తీసుకొచ్చింది. 2006 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. గ్రామీణ కుటుంబాలకు ఏడాదికి కనీసం 100 రోజులు కూలి పని కల్పించారు. తరువాత దీనికి మహాత్మాగాంధీ పేరును జతచేశారు. ఈ పథకం దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధికి భరోసాగా నిలిచింది. కరువు, వలసలు, ఆర్థిక మాంద్యం వంటి సమయాల్లో కోట్లాది కుటుంబాలకు ఇది జీవనాధారంగా మారింది. ఖర్చు భారంలో కేంద్ర, రాష్ట్రాలు కలిసి భరిస్తున్నాయి. అన్‌స్కిల్డ్ కూలీల వేతనం 100 శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. మెటీరియల్ ఖర్చు (పనుల కోసం సామగ్రి కేంద్రం 75 శాతం, రాష్ట్రాలు 25 శాతం పరిపాలనా వ్యయంపూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ విధానం వల్ల పథకం అమలులో రాష్ట్రాలపై ఆర్థిక భారం కొంత మేర తగ్గుతుంది.
కొత్త పథకంపై అనుమానాలు
ప్రభుత్వం సూచిస్తున్న కొత్త పేరుతో పథకం స్వరూపం మారుతుందా? అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. ‘మహాత్మాగాంధీ పేరు తొలగించడం చారిత్రక విలువలను కించపరచడమే. ఉపాధి హక్కును చట్టబద్ధ హక్కుగా కాకుండా, ఒక సాధారణ సంక్షేమ పథకంగా మార్చే ప్రమాదం ఉంది. మరోవైపు బీజేపీ వర్గాలు మాత్రం ఇది పేరు మార్పే తప్ప, పథక లక్ష్యాలు మారవని వాదిస్తున్నాయి. అయితే ఈ కొత్త పేరుతో వస్తున్న పథకం అమలైతే ఆ పథకం లాభనష్టాలపై ఒక అంచనాకు రావొచ్చు. ఇక కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్నారు.
Read Also: పోలింగ్ కేంద్రం దగ్గర కుర్చీ వేసుకొని కూర్చున్న ఎమ్మెల్యే
Follow Us On: Youtube


