కలం డెస్క్ : తెలంగాణ పట్ల కేంద్రంలోని అధికార బీజేపీ వివక్షపై మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) తీవ్ర స్థాయిల మండిపడ్డారు. గోదావరి నది తెలంగాణ భూభాగంలో ఎక్కువగా ప్రవహిస్తున్నా, ఇక్కడే ప్రవేశిస్తున్నా ఆ నది పుష్కారలకు కేంద్రం నిధులు ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. అన్ని రాష్ట్రాలను కలుపుకుపోయేలా ‘సబ్ కా సాథ్’ అని బీజేపీ గొప్పగా చెప్పుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ కు నిధులిచ్చి తెలంగాణకు మొండి చేయి చూపడాన్ని తప్పుపట్టారు.
బీజేపీ ఎప్పుడైనా సంపన్నుల పక్షమేనని, పేదల బాధలు పట్టవని, ఉత్తరాది రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాధాన్యతను దక్షిణాదికి ఇవ్వదని ఆరోపించారు. గతం నుంచీ తెలంగాణ పట్ల బీజేపీకి చిన్నచూపేనని, నిధుల విడుదలలో అనేకమార్లు ఇది రుజువైందన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం గాంధారి మండలంలో నిర్వహించిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన హరీష్ రావు పై వ్యాఖ్యలు చేశారు.
ఏపీకి వంద కోట్ల ఆర్థిక సాయం :
గోదావరి నది పుష్కరాలు(Godavari Pushkaralu) 2027లో జరగనున్నాయని, ఆంధ్రప్రదేశ్ కు రూ. 100 కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మాత్రం గుండు సున్నా ఇచ్చిందని హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలు గెలిచారని, ఇందులో ఎక్కువ మంది గోదావరి నది పరివాహక ప్రాంతంలోని నియోజకవర్గాలకు చెందినవారేనని గుర్తుచేశారు. నిజామాబాద్ జిల్లా కందకుర్తి దగ్గర గోదావరి నది తెలంగాణలో ప్రవేశిస్తుందని, అనేక జిల్లాలు దాటి భద్రాచలం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కలుస్తుందని వివరించారు. అయినా తెలంగాణకు గోదావరి పుష్కరాల అవసరాలకు నిధులు ఇవ్వకపోవడంపై బీజేపీ చిత్తశుద్ధి ఎలాంటిదో తేలిపోయిందన్నారు. ఎనిమిది మంది ఎంపీలు కొట్లాడి సాధించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలైనా పార్లమెంటు వేదికగా కొట్లాడి నిధులను సాధించాలన్నారు.
ఇతర పథకాల్లోనూ బీజేపీ వివక్ష :
ఉత్తరాది రాష్ట్రాల్లో గోధుమ పంట విస్తారంగా పండుతుందని, దానికి మద్దతు ధర పెంచి దక్షిణాదిలో పండించే వరి పంటపై బీజేపీ చిన్నచూపు చూసిందని హరీశ్ రావు(Harish Rao) గుర్తుచేశారు. ఒక్కో వరి రైతు ఎకరానికి సుమారు రూ. 7 వేలు నష్టపోతున్నారని, ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినందుకు ఇది పనిష్ మెంటా అని ప్రశ్నించారు. దేశం కోసం, ధర్మం కోసం అంటూ డైలాగులు కొట్టే మోడీ ‘సబ్ కా సాథ్… సబ్ కా వికాస్’ అంటూ జపిస్తారని, మాటల్లోని గాంభీర్యం చేతల్లో ఎందుకు లేదన్నారు.
గతంలో మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలోనూ వివిధ రాష్ట్రాల్లో 157 కాలేజీలను ప్రకటిస్తే తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి తెలంగాణను కేంద్రం విస్మరించిందన్నారు. ఐదేళ్లుగా రీజినల్ రింగ్ రోడ్డుకి నిధులే ఇవ్వడం లేదన్నారు. ప్రజలంతా బీజేపీ ఎంపీలను నిలదీయాలని పిలుపునిచ్చారు.

