కలం, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తమ సొంత జిల్లాల్లోనే అన్ని రకాల నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) తెలిపారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా ప్రజలు హైదరాబాద్ వరకు రాకుండా, స్థానికంగానే చికిత్స పొందేలా సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ పునర్వ్యవస్థీకరణపై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా రూపొందించిన అధ్యయన నివేదిక ఆధారంగా ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ లక్ష్య సాధన కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా, జిల్లా ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు, స్పెషలిస్ట్ సేవలు, ఆధునిక డయాగ్నస్టిక్ సౌకర్యాలను విస్తృతంగా అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇటీవల 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యులతో పాటు నర్సులు, పారామెడికల్ సిబ్బందిని నియమించామని గుర్తుచేశారు. ఆసుపత్రులలోని సిబ్బందిని, పరికరాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ప్రతి ఆసుపత్రిలోని సదుపాయాలపై సమగ్ర సమీక్ష జరిపి, ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పాలనాపరమైన పర్యవేక్షణను పటిష్టం చేసేందుకు ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

