కలం, నిజామాబాద్ బ్యూరో: ఏఐసీసీ ఆదేశాల మేరకు నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమం నిర్వహించారు. కాకతీయ కాలేజీలో డీసీసీ నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహేర్ బిన్ హాందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా ఛైర్మన్ కేశ వేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ… కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలతో విద్యార్థులు, యువత భవిష్యత్ ఆందోళనకర పరిస్థితిలో ఉందన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేపర్ లీకేజీలకు పాల్పడుతూ విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. వారికి అండగా లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా పోరాటానికి శ్రీకారం చుట్టారని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, సీనియర్ నాయకులు జావీద్ అక్రమ్, ప్రీతం, ముస్తఫా, గోవర్దన్, వహీద్ పాల్గొన్నారు.

