Mobile Popup Ad
Mobile Popup Ad

మహిళా సంఘాలకు రైస్ మిల్లులు.. పొంగులేటి కీలక ప్రకటన

కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు త్వరలోనే రైస్ మిల్లులు (Rice Mills) మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్రంలోనే తొలి రైస్ మిల్లును ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని ఓ మహిళా సంఘానికి కేటాయించి, ఇక్కడి నుంచే ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆదివారం నేలకొండపల్లి మండలంలోని అప్పల నరసింహపురం, రాజారాంపేట, కొరట్లగూడెం గ్రామాలలో  స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మహిళా సంఘాలు చిన్న వ్యాపారాలకే పరిమితం కాకుండా పెద్ద స్థాయి పరిశ్రమలవైపు ఎదగాలని సూచించారు. రైస్ మిల్లుల ఏర్పాటు ఆ దిశగా కీలక అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఇప్పటికే మహిళా సంఘాలు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులను సమర్థవంతంగా నిర్వహిస్తూ తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాయని మంత్రి కొనియాడారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.63 వేల కోట్ల రుణాలను సున్నా వడ్డీకే అందజేసినట్లు తెలిపారు. వ్యాపార రంగంలో మహిళలకు అవసరమైన స్థలం, మౌలిక వసతులు, బ్యాంక్ లింకేజీలు కల్పిస్తూ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>