కలం, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సిపీ) నాయకురాలు, ఎంపీ నుస్రత్ తబస్సుమ్ జ్యోతి (Bangladesh NCP MP Nusrat Tabassum Jyoti) ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి జరిగినట్లు తెలుస్తోంది. కుష్టియా జిల్లాలోని దౌలత్పూర్ ఉపజిల్లా బగోవాన్ గ్రామంలో ఉన్న ఎంపీ పూర్వీకులు ఇంట్లో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఐదు గదులు పూర్తిగా దగ్ధంకాగా.. రెండు మేకలు మృత్యువాత పడ్డాయి. ఘటనపై స్పందించిన నుస్రత్ గుర్తు తెలియని వ్యక్తులు తమ కుటుంబ ఆస్తిపై పెట్రోల్ బాంబులు విసిరారని ఆరోపించారు.
అయితే, ఎంపీ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి జరిగినట్లు పోలీసులు ధృవీకరించలేదు. ప్రమాద సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. కాగా తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులు గాయపడ్డారని నుస్రత్ తెలిపారు. ఈ ఘటన వెనుక నిషేధిత అవామీ లీగ్ ప్రమేయం ఉండవచ్చని ఎన్సీపీ నేతలు ఆరోపించారు. ఎంపీ (Bangladesh NCP MP) ఇంటిపైనే బాంబుల దాడి జరిగితే సాధారణ ప్రజల పరిస్థితేంటని వారు ప్రశ్నించారు. అగ్నిప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

