కలం, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు (Prof Nageshwar Rao )వ్యవహారంపై అనిరుధ్ రెడ్డి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగేశ్వర్ రావును విమర్శించే స్థాయి పవన్ కల్యాణ్‌కు లేదని, ఆయన కాలి గోటికి కూడా పవన్ సరిపోడని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఒక ప్యాకేజ్ స్టార్ అని, చంద్రబాబు ప్యాకేజీ ఇస్తే ఆయనతో ఉన్నాడని, ఇప్పుడు అమిత్ షా దగ్గరికి వెళ్లి ప్యాకేజీ మాట్లాడుకున్నాడేమోనని ఆరోపించారు. నాగేశ్వర్ రావును అరెస్ట్ చేయాలని చూస్తున్నారని, ఆయనను అరెస్ట్ చేసే ముందు ఆయన ఇంటి ముందు తాను నిల్చుంటానని, తనను అరెస్ట్ చేసి నాగేశ్వర్ రావును అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణ బిడ్డలను ఎవరినైనా ముట్టుకోవాలని ఆంధ్ర నుంచి వస్తే మళ్లీ గో బ్యాక్ ఆంధ్రా అని ఉద్యమం ప్రారంభిస్తామని, అప్పుడు తెలంగాణలో ఒక్కరు కూడా ఉండలేరని హెచ్చరించారు.
ఇక ఏపీ రాజధాని అమరావతిపై అనిరుధ్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో ఉండే వారికి ఆంధ్రాలో రాజధాని ఎందుకని ప్రశ్నించారు. అమరావతికి ఖర్చు పెట్టే డబ్బులేవో తెలంగాణకు ఇవ్వాలని, జడ్చర్లలో 5 వేల ఎకరాలు రాజధానికి కోసం ఇస్తామని చెప్పారు. రాజధానిని 99 ఏండ్లు లీజుకు ఇస్తామని, ఇక్కడే ఉండాలని చెప్పారు. హైదరాబాద్‌లోనే ఉండి ఏపీ పాలన చేసుకోవచ్చని చెప్పారు. పవన్ కల్యాణ్‌కు మంచి ప్యాకేజీ ఇస్తే జగన్‌తో కూడా కలిసిపోతాడని తనకు అనుమానం కలుగుతోందని అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇక తెలంగాణలో సీఎం మార్పు వ్యాఖ్యలపై అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందని, ఇప్పట్లో సీఎం మార్పు వంటివి ఏమీ ఉండబోవని చెప్పారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు తన ఫోన్ తో పాటు తన భార్య, తల్లి, కార్యకర్తల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని, ఈ మేరకు సిట్ తమను విచారణకు పిలిచిందని అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. సోమవారం విచారణకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏదైనా ఉంటే తనతో రాజకీయంగా కొట్లాడాలని, తన తల్లి, భార్యను ఎందుకు బయటకు లాగుతున్నారని మండిపడ్డారు. భార్యాభర్తలు మాట్లాడుకుంటే వినే చిల్లర బుద్ది ఏమిటని ప్రశ్నించారు. దీనికి బదులు యూట్యూబ్‌లో లేదా ఆన్‌లైన్‌లో అశ్లీల వీడియోలు చూసి బతకొచ్చు కదా అని విమర్శించారు. తాను రాజకీయంగా ఎదగకూడదని ఈ కుట్రకు పాల్పడ్డారని, సోమవారం నాడు నీ సంగతి చూస్తానని లక్ష్మారెడ్డిని హెచ్చరించారు.
Read Also: దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: కేంద్ర ప్రభుత్వం
Read Also: పెట్రో బాదుడు పాపం తలా పిడికెడు

