కలం, వరంగల్ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జాకోరులా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) విమర్శించారు. హైదరాబాద్‌లో సెంట్రల్ యూనివర్సిటీ, నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలకు చెందిన వేల కోట్ల విలువైన భూముల స్వాధీనానికి ప్రయత్నించిందని, ఇప్పుడ కాకతీయ విశ్వవిద్యాలయం భూములపై కన్నేసిందని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం భూములపై ఆధారపడి పనిచేస్తోందని విమర్శించారు. గురువారం వరంగల్‌లో పర్యటించిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వరంగల్ సిటీలో రూ.4వేల కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఆ విషయమే పట్టించుకోవడం లేదన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వరంగల్ అభివృద్ధి జరుగుతోందన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో సరిపడా ప్రొఫెసర్లు, లెక్చరర్లు లేరన్నారు. ఈ వర్సిటీ భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసి, భూములు అమ్ముకునేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీకి రూ.వెయ్యి కోట్ల నిధులు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ, కనీసం వెయ్యి రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు.
కేసీఆర్ ఓటీపీలా వచ్చి వెళ్లారు..
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడం లేదు కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మాత్రం ప్రమాదకర స్థాయికి తీసుకెళ్లిందని రాంచందర్ రావు (Ramchander Rao) అన్నారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చ జరగలేదన్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఓటీపీ లాగా ఇలా వచ్చి.. అలా మాయమైపోయారని ఎద్దేవా చేశారు. భూముల కబ్జా, రైతు బంధు, నిరుద్యోగ భృతి, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు వంటివాటిపై చర్చించకుండా ప్రజాధనాన్ని, సమయాన్ని వృథా చేశారని కాంగ్రెస్, బీఆర్ఎస్లను విమర్శించారు.
మున్సిపోల్స్‌లో బీజేపీ జెండా ఎగరాలి:
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ప్రజలను రాంచందర్ రావు కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. అమృత్ స్కీమ్స్, స్మార్ట్ సిటీలు, హృదయ్ స్కీమ్స్ తో పాటు వివిధ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా రూ.వేలకోట్ల నిధులు కేటాయించిందన్నారు. మున్సిపాలిటీలను సమర్థంగా అభివృద్ధి చేస్తోందన్నారు. మామునూరు ఎయిర్ పోర్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తిచేసి ఇస్తే, ఇక్కడ బ్రహ్మాండమైన ఎయిర్ పోర్టు నిర్మాణం చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతంరావు, తూళ్ళ వీరేందర్ గౌడ్, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుండె గణేష్, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్, మాజీ ఎమ్మెల్యేలు ఎం.ధర్మారావు, వన్నాల శ్రీరాములు, ఒంటేరు జైపాల్, మాజీ ఎంపీ సీతారామ్ నాయక్, హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, రావు పద్మారెడ్డి, డా.పగడాల కాళీ ప్రసాద్, కార్పొరేటర్లు చాడ స్వాతి, వసంత, రావుల కోమల, అభినవ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


