రేగ ఇలాకాలో గులాబీకి “హస్తం” షాక్!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ (BRS) జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు కంచుకోటగా భావించే పినపాక (Pinapaka) నియోజకవర్గంలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రేగ ఇలాకా నుంచి భారీగా కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరడం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాలకు పినపాక నియోజకవర్గం కేంద్రబిందువుగా మారింది. బీఆర్ఎస్ జిల్లా సారథి రేగ కాంతారావు కంచుకోటలో ఇప్పుడు ‘చేరికల సెగ’ మొదలైంది. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న రాజకీయ వాతావరణం, తాజా వలసలతో ఒక్కసారిగా వేడెక్కింది.

రేగ కాంతారావుకు అత్యంత సన్నిహితులుగా పేరున్న పలువురు స్థానిక నాయకులు, వార్డు మెంబర్లు గ్రామ స్థాయి కార్యకర్తలు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. అందులో భాగంగానే సోమవారం పినపాక నియోజకవర్గంలోని గుండాల మండలం లింగగూడెం పంచాయతీ 3వ వార్డు మెంబర్ కుంజా రామస్వామితో పాటు బీఆర్ఎస్ నాయకులు కల్తీ రామక్రిష్ణ దొర, ఆదినారాయణ, కుంజా శ్రీను, కుంజా కృష్ణయ్య, ఇర్పా వీరస్వామి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇతర పార్టీ నాయకులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు.

రాజకీయం అంటేనే నిరంతర చలనం. నిన్నటి వరకు ఒక వెలుగు వెలిగిన కోటలో నేడు బీటలు వారడం సహజం. అయితే, తన ఇలాకాలో జరుగుతున్న ఈ పరిణామాలను రేగ కాంతారావు ఎలా అడ్డుకుంటారో వేచి చూడాలి. అలాగే పినపాకలో మొదలైన ఈ ‘చేరికల పర్వం’ కేవలం ప్రారంభం మాత్రమేనా? లేక రేగ కాంతారావు తన వ్యూహాలతో తిరిగి కేడర్‌ను ఏకం చేస్తారా? అనేది ఇప్పుడు భద్రాద్రి జిల్లాలో హాట్ టాపిక్. ప్రస్తుతానికి మాత్రం పినపాకలో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోందని స్థానిక ప్రజల ద్వారా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యకర్తల్లో నెలకొన్న అసంతృప్తి, సరైన దిశానిర్దేశం లేకపోవడం కూడా ఈ వలసలకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>