స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్

కలం, వరంగల్ బ్యూరో: ఈ నెల 6వ తేదీతో గ్రేటర్ వరంగల్ (Warangal) కార్పొరేషన్ పాలక వర్గం గడువు ముగుస్తోంది. ఇప్పటికే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో ఇక నుంచి ప్రత్యేకాధికారి పాలనలోకి వెళ్లనుంది. అయితే కార్పొరేషన్‌కు పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడంతో హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆమె కమిషనర్‌గా పని చేశాకే.. కొద్దిరోజుల కిందట జరిగిన బదిలీల్లో హనుమకొండ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆమె స్థానంలో మరో అధికారిని నియమించకపోవడంతో చాహత్ బాజ్‌పాయ్ కార్పొరేషన్ కమిషనర్ బాధ్యతలు కూడా చూస్తున్నారు.

అప్పట్లో బీఆర్ఎస్ కైవసం..

2021లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. గ్రేటర్‌లోని మొత్తం 66 డివిజన్లు గాను అప్పటి బీఆర్ఎస్ పార్టీ 48 సీట్లు సాధించి కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేసింది. కాంగ్రెస్ 11స్థానాలు గెలుచుకోగా, బీజేపీ అయిదు సీట్లతో సరిపెట్టుకుంది. స్వతంత్రులు రెండు స్థానాల్లో విజయం సాధించారు. గ్రేటర్ వరంగల్ మేయర్‌గా బీఆర్ఎస్ నుంచి గుండు సుధారాణి ఎన్నికయ్యారు. అయితే, 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో పరిస్థితి తలకిందులైంది. మేయర్ గుండు సుధారాణి అనుచర‌గణంతో కాంగ్రెస్‌లో తన పదవిని కాపాడుకున్నారు.

ఆరో తేదీన ఆఖరి సమావేశం..

ప్రస్తుత పాలకవర్గం గడువు ముగుస్తున్న క్రమంలో ఈ నెల 6న సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఇదే అఖరి సమావేశం కానుంది. ఈ సమావేశానికి జిల్లా మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో గత ఐదేళ్లలో గ్రేటర్‌లో జరిగిన అభివృద్ధి పనుల‌పై సమీక్ష చేయనున్నారు. అంతేగాకుండా పెండింగ్ పనులు, పురోగతిలో ఉన్న వాటిపై సమీక్ష చేస్తారు.

మరి ఎన్నికలెప్పుడు?

రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో ఎన్నికలు పూర్తవగా హైదరాబాద్, వరంగల్ కార్పొరేషన్లకు మాత్రం ఇంకా నిర్వహించలేదు. రెండింటికి కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే వరంగల్ నగరం విస్తరిస్తున్న క్రమంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా డివిజన్లు పెంచాలనే డిమాండ్లు ఉన్నాయి. ఈ మేరకు గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు ఇతర ముఖ్య నాయకులు సీఎంను కలిసి ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. సీఎం సానుకూలంగా స్పందించడంతో డివిజన్లు పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే గ్రేటర్ ఎన్నికలు వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>