కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పేద ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వీరుడు పండుగ సాయన్న పోరాట చరిత్రను భావితరాలకు సగర్వంగా అందిస్తామని ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) పేర్కొన్నారు. విగ్రహ ఏర్పాటుకు సంబంధించి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మన్యంకొండలో అనువైన స్థలాన్ని పరిశీలించారు. పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మన్యంకొండ దేవాలయ ప్రాంగణంలో పండుగ సాయన్న భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన పండుగ సాయన్న ఆశయాలు, త్యాగాలను స్మరించుకునేలా విగ్రహ ఏర్పాటు ఉంటుందని తెలిపారు.
అనంతరం యెన్నం మాట్లాడుతూ.. పండుగ సాయన్న జీవితం, పేదల కోసం చేసిన పోరాటాలు నేటి యువతకు, భావితరాలకు గొప్ప స్ఫూర్తినిస్తాయన్నారు. ఆ మహనీయుని పోరాట పటిమను ప్రజల్లో సజీవంగా ఉంచడమే విగ్రహ ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. స్థల పరిశీలన పూర్తయినందున, పరిపాలనాపరమైన పనులను వేగవంతం చేసి త్వరలోనే విగ్రహ ప్రతిష్ఠాపనకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. అనంతరం నిర్మాణంలో ఉన్న తెలంగాణ టూరిజం హోటల్ ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఓబ్లాయిపల్లి సర్పంచ్ కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు మైత్రి యాదయ్య, మల్లు అనిల్ రెడ్డి, ఖాజా, చంద్రమౌళి, తుప్పలి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

