కలం, వెబ్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ. లక్ష కోట్ల ప్రజాధనం వృథా చేశారంటూ రాజ్యసభలో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీ.ఆర్. పాటిల్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) స్పందించారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో జరిగిన ప్రెస్ మీట్ లో దీనిపై హరీశ్ రావు స్పందిస్తూ.. బీఆర్ఎస్ పార్టీపై బురదజల్లే అంశంలో కాంగ్రెస్, బీజేపీల అనుబంధం బట్టబలైందని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) కు అన్ని అనుమతులు కేంద్రమే ఇచ్చిందని హరీశ్ రావు గుర్తు చేశారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం మెచ్చుకున్నారని వెల్లడించారు. కాళేశ్వరం పంటల ఉత్పత్తి రెట్టింపు అయ్యిందని కేంద్ర ఆర్థిక సర్వేలు కూడా చెప్పాయని తెలిపారు. కాళేశ్వరంపై పాటిల్, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు తేడా లేదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంపై రూ.90 వేల కోట్లు ఖర్చు చేస్తే రూ. లక్ష కోట్లు అని అంటున్నారని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టే కొట్టుకుపోతే మల్లన్న సాగర్ లో 25 టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయన్న ఆయన.. దమ్ముంటే కాంగ్రెస్, బీజేపీ నేతలు తమతో రావాలని సవాల్ చేశారు. కాళేశ్వరం నీళ్లతో పండుతున్న పొలాలను వారికి తాము చూపిస్తామని ఛాలెంజ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
అటు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అసెంబ్లీ పని దినాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయని హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. వారం రోజులు సభను ఎక్స్‌టెండ్ చేయమని అడిగినా ప్రభుత్వం ముందుకు రాలేదని ఆరోపించారు. కేరళ ఎన్నికల ప్రచారం కోసం అసెంబ్లీని 30వ తేదీనే హడావుడిగా ముగించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు, ప్రజా సమస్యలు ముఖ్యమా? కేరళ ఎన్నికల ప్రచారం ముఖ్యమా? అని ప్రశ్నించారు. హౌస్ కమిటీ పనికిరాదని చెప్పి, శాసనసభ్యులకు, శాసనసభకు గౌరవాన్ని తగ్గించారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరూ మా బడ్జెట్ చింపుతారా? అని మాట్లాడుతున్నారన్న ఆయన.. వారి బడ్జెట్‌లో ఏమీ లేదు.. అది పూర్తిగా డొల్ల బడ్జెట్, కాబట్టే చింపి తమ నిరసనను వ్యక్తం చేశామని చెప్పుకొచ్చారు. ఈ విమర్శ భట్టిని వ్యక్తిగతంగా అన్నది కాదని.. ఆ హోదాలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించామని స్పష్టం చేశారు.
Read Also: బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే.. కేటీఆర్, హరీశ్‌పై విప్ వేముల ఫైర్
Follow Us On : WhatsApp

