కలం, వరంగల్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్దదైన గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠం (Greater Warangal Mayor Post)పై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఎలాగైనా ఆ పీఠాన్ని దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. అధికార పార్టీ కావడంతో ఆ పక్షం నుంచి మేయర్ పదవి ఆశిస్తున్న ఆశావాహుల సంఖ్య భారీగానే ఉంది. ఓ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ తమ వర్గానికి చెందిన వారికే పీఠం కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుంటే, ఇద్దరు నామినేటెడ్ పదవుల్లో ఉన్న సీనియర్ నేతలు మాత్రం ఆ పీఠం తమకే కావాలని అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో ఒక్కసారిగా వరంగల్ రాజకీయం వేడెక్కింది. అసెంబ్లీ సమావేశాల తర్వాత అందరూ దీనిపైనే ఫోకస్ పెట్టే అవకాశం ఉందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
జనరల్ తో తీవ్ర పోటీ..!
గ్రేటర్ వరంగల్ (Greater Warangal) మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం రిజర్వేషన్ జనరల్ కు కేటాయించడంతో అందరి చూపు వరంగల్ నగరంపై పడింది. ప్రధానంగా అధికారపార్టీ పెద్దలు ఈ పీఠాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గెలుపుగుర్రాల కోసం రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. అధికారపార్టీ కావడంతో కాంగ్రెస్ నుంచి మేయర్ పీఠం ఆశిస్తున్న వారి సంఖ్య చాంతాడంత ఉంది. అయితే ప్రధానంగా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తమ వర్గానికి చెందిన వారికి లేదా తమ కుటుంబీకులకు మేయర్ పదవి ఇప్పించుకోవడం కోసం పోటీపడుతున్నారు. రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి స్వయంగా తమకే మేయర్ పీఠం కావాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన వారు, పార్టీ కోసం పనిచేసి ఇతర పదవులు దక్కని వారు కూడా మేయర్ పీఠం కోసం పోటీపడుతున్నట్లు తెలుస్తోంది.
వారసుల కోసం నేతల పాట్లు
వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండా సురేఖ-కొండా మురళీ దంపతుల కుమార్తె కొండా సుష్మితాపటేల్ (Konda Susmita Patel) కోసం ఆ దంపతులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. గతంలో ఈ కుటుంబం నుంచి రెండు ఎమ్మెల్యే టికెట్లు ఆశించారు. కానీ అధిష్ఠానం అందుకు అంగీకరించలేదు. అధికారంలోకి వస్తే కొండా మురళీకి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు పార్టీ పెద్దలు. కానీ, అది ఇప్పటి వరకూ అమలుకాలేదు. ఈ నేపథ్యంలో కొండా దంపతులు తమ కూతురు కొండా సుష్మితాపటేల్ కు మేయర్ పదవి దక్కించుకోవడం కోసం పావులు కదిపినట్లు తెలుస్తోంది. ఒకవేళ సుష్మితాపటేల్ కు మేయర్ పదవి ఇవ్వకపోతే.. తూర్పునియోజకవర్గం పరిధిలో అధిక డివిజన్ స్థానాలు ఉండటంతో తమ వర్గానికి చెందిన నేతకే మేయర్ పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఇదే నియోజకర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న బస్వరాజు సారయ్య (Baswaraju Saraiah) కూడా తమ వర్గానికి మేయర్ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారట. కొండా దంపతులకు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యకు మధ్య విభేదాలు ఉన్న నేపథ్యంలో సారయ్య వర్గానికి కొండా దంపతులు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే ఈరెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సారయ్య వర్గానికి అధిష్ఠానం మొగ్గుచూపే పరిస్థితి ఉండదన్న చర్చ జరుగుతోంది.
ఇక వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) మేయర్ పీఠంపై ఫోకస్ పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. నాయిని రాజేందరెడ్డి కూతురు గోదారెడ్డి లేదంటే అల్లుడు విష్ణువర్థన్ రెడ్డి కైనా మేయర్ పీఠం కావాలని ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు నాయిని తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. మేయర్ పీఠం దక్కించుకోవడం అంటే వరంగల్ నగరంలోని (Greater Warangal) అందరూ నేతలతో సన్నితంగా మెలగాల్సి ఉంటుంది. అయితే ఇటీవల మంత్రి కొండా సురేఖ దంపతులు-ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ మధ్య విభేదాలు ముదిరి అధిష్ఠానానికి ఫిర్యాదు చేసుకునే వరకూ వెళ్లాయి. ఈ విభేదాలు మొన్నటి వరకూ కొనసాగాయి.
వీటికి చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది . ఇటీవలే ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.. కొండా మురళీని మర్యాదపూర్వకంగా కలిసినట్టు తెలుస్తోంది. ఇలాగే మిగిలిన నేతలందరినీ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు వినికిడి. ఇక వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా తన కొడుకు పృధ్వీరాజ్ కు మేయర్ పీఠం కోసం ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. తనకు పార్టీలో ఉన్న పెద్దల పరిచయాలతో అధిష్టానాన్ని ఒప్పించి మేయర్ పీఠం దక్కించుకునే ప్రయత్నంలో ఎమ్మెల్యే నాగరాజు ఉన్నట్లు సమాచారం .
సీనియర్ నేతల కన్ను
కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి కూడా తమకు మేయర్ పదవి కావాలని అధిష్ఠానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. మరో ఏడాదిలో తన పదవీకాలం ముగుస్తున్నందున ఈ నేత మేయర్ పదవిపై కన్నేసినట్లు సమాచారం. జంగా రాఘవరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఆశించారు. కానీ అధిష్ఠానం బుజ్జగించి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆయిల్ ఫెడ్ చైర్మన్ పదవి కట్టబెట్టింది. ఈ పదవిపై జంగా సంతృప్తిగా లేకపోవడంతో వరంగల్ మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నారు. ఇటు కుడా చైర్మన్ గా ఉన్న ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కూడా మేయర్ పదవి ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆయన తీవ్రమైన ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలిసింది. గతంలో పరకాల నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించారు.
అయితే అది చివరి నిమిషంలో చేజారింది. దీంతో అప్పట్లో న్యాయం చేస్తామని పార్టీ హామీఇచ్చి అధికారంలోకి రాగానే ఇనగాలకు కుడా ఛైర్మన్ పదవి అప్పగించింది. అయితే, మరో రెండు నెలల్లో ఈ పదవి కాలం ముగుస్తుండటంతో వరంగల్ మేయర్ పీఠంపై ఇనగాల గురిపెట్టారు. తనకు అధిష్ఠానంతో ఉన్న సంబంధాలను ఉపయోగించి మేయర్ పీఠం దక్కించుకోవాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరీ అధిష్ఠానం ఎవరికి మేయర్ పీఠం కట్టబెడుతుందో తెలియాలంటే కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.
Read Also: ఎన్ని నోటీసులు ఇచ్చినా నేను వెనక్కి తగ్గను: కౌశిక్ రెడ్డి
Follow Us On : WhatsApp

