Mobile Popup Ad
Mobile Popup Ad

బడి బస్సు పదిలమేనా..?

కలం, వరంగల్ బ్యూరో: విద్యా సంస్థలకు వేసవి సెలవులు ముగుస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్నాయి. అయితే వరంగల్ (Warangal), హనుమకొండ, కాజీపేట్ నగరాల్లో ఉన్న మెజారిటీ స్కూళ్లలో సగానికి పైగా విద్యార్థులు స్కూల్ బస్సుల (School Bus)ద్వారానే పాఠశాలలకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ఆయా విద్యా సంస్థలకు చెందిన బస్సులకు రవాణా శాఖ అధికారులు ఫిట్ నెస్ పరీక్షలు (Fitness Checks) చేయించాల్సి ఉంటుంది. వాళ్లు ఓకే అని నిర్ధారణ చేసిన తర్వాతే బస్సు రోడ్డు ఎక్కాల్సి ఉంటుంది. కానీ కొంతమంది అవినీతి అధికారుల కారణంగా సామర్థ్యం లేని బస్సులు నడుపుతున్న యాజమాన్యాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.

గడువు ముగుస్తున్నా..

ప్రతి ఏడాది మే 31 లోపు లేదా విద్యా సంస్థల ప్రారంభానికి ముందు అన్ని స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా చేయించుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 3500 వరకు విద్యా సంస్థలకు చెందిన బస్సులు తిరుగుతున్నాయి. ఇందులో ప్రతి ఏడాది 70 శాతం మేరకు బస్సులకు ఫిట్ నెస్ సామర్థ్యం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మిగిలిన 30 శాతం బస్సులు నిబంధనలు ఉల్లఘించి తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ బస్సులపై నిఘా ఉంచి వాటికి కళ్లెం వేయాల్సిన అధికారులు మామూళ్ల‌ మత్తులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

యాజమాన్యాల నిర్లక్ష్యం

ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి ఏడాది స్కూల్ బస్సులకు ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించాలి. 15 ఏళ్లు దాటిన బస్సులు రోడ్డెక్కితే సీజ్ చేస్తారు. ఒక బస్సుకు ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, ట్యాక్స్ కలిపి రూ.40-50 వేలు అవుతుంది. కానీ కొంతమంది ఫిట్ నెస్, ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. మరి కొంతమంది ఫిట్‌నెస్‌కి వెళ్తే దొరికిపోతామని భయంతో ఓవర్ లోడ్ తో కాలం చెల్లిన 40 సీట్ల బస్సులో 60-70 మంది పిల్లల్ని కుక్కి ప్రమాదాలకు కారణమవుతున్నారు.

నిబంధనలకు పాతర…?

ఆర్ టీ ఏ రూల్స్ ప్రకారం బడి బస్సులో కొన్ని వస్తువులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. రవాణా శాఖ ద్వారా పొందిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ముందు అద్దం మీద అతికించాలి. బస్సును 40 కి. మీ వేగం దాటకుండా లాక్ చేయాలి. విద్యార్థుల సంఖ్య ను బట్టి మేల్, లేడీ అటెండర్ ను నియమించాలి. అత్యవసర ద్వారం, ఫైర్, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అమర్చుకోవాలి. డ్రైవర్‌కి 10 ఏళ్ల అనుభవంతో పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలి. అయితే 70 శాతం ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో ఇలాంటి నిబంధనలు పాటించడం (School Bus Safety) లేదని సమాచారం.

బదిలీలతో హడావిడిగా ఫిట్‌నెస్‌లు

వారం రోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రవాణా శాఖలో అధికారుల బదిలీలు జరుగనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొందరు అధికారులు సందేట్లో సడేమియా అన్నట్లు మేము ఉండగానే ఫిట్ నెస్ పరీక్షలు చేయించుకోవాలని పాఠశాలల యాజమాన్యాలకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కొందరు అధికారులను ప్రసన్నం చేసుకుని హడావిడిగా ఫిట్ నెస్ పరీక్షలు చేయించుకున్నారు. ఇంకా సగానికి పైగా బస్సులకు పరీక్షలు జరగ లేదనే ప్రచారంలో ఉంది. ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు స్పందించి ఉమ్మడి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ పేరిట బస్సుల ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించి కాలం చెల్లిన బస్సులను నిలువరించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

Read Also: పేదలను సంతృప్తి పరిచేలా ఇండ్ల నిర్మాణాలు : మంత్రి పొంగులేటి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>