కలం, వెబ్‌డెస్క్: ఈ కాలపు యువత చర్మ సౌందర్యానికి (Skincare) అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకోసం రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌తో పాటు వంటింటి చిట్కాలు ట్రై చేస్తున్నారు. అయితే సరైన అవగాహన లేకుండా వాడే కొన్ని ఉత్పత్తులు ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి బదులు దెబ్బతీసే ప్రమాదం ఉంది. మరి చర్మానికి హాని కలిగించే ఆ ఉత్పత్తులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
బాడీలోషన్ (Body Lotion)
సాధారణంగా బాడీలోషన్ చర్మానికి తేమను అందించడానికి వాడుతాం. కానీ కొంతమంది దీన్నే ఫేస్‌కు కూడా వాడుతుంటారు. దీనివల్ల లోషన్‌లోని జిడ్డుదనం ముఖ చర్మ రంధ్రాలలోకి చేరి క్రమంగా మొటిమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి బాడీ లోషన్‌ను ముఖానికి వాడకూడదట.
టూత్ పేస్ట్ (Tooth Paste)
కొంత మంది మొటిమలు ఉన్నచోట టూత్ పేస్ట్ పెడుతుంటారు. ఇలా టూత్ పేస్ట్ పెట్టిన చోట రంగు మారడం, నల్లమచ్చలు రావడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అంతే కాకుండా టూత్ పేస్ట్‌లో ఉండే గాఢమైన పదార్థాల వల్ల ముఖంపై ఇన్ఫెక్షన్లు, అలర్జీలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
నిమ్మకాయ (Lemon)
ముఖ సౌందర్యం కోసం అనేక స్క్రబ్స్, ఫేస్ ప్యాక్స్ వాడుతుంటాం. వీటిలో నిమ్మరసాన్ని ఉపయోగిస్తుంటాం. కొంత మంది నిమ్మచెక్కను ఏకండా ముఖంపై అప్లై చేస్తుంటారు. దీనివల్ల ఇందులోని కొన్ని సమ్మేళనాలు కొంతమందిలో ముఖ చర్మాన్ని మరింత సున్నితంగా మార్చుతాయని చెబుతున్నారు నిపుణులు. తద్వారా ఎండలోకి వెళ్లినప్పుడు చర్మం ఇరిటేషన్‌కి గురై దురద, మంట వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు.
వ్యాక్స్ చేస్తున్నారా? (Wax)
చాలామందికి ముఖంపై అవాంఛిత రోమాలు ఉంటాయి. అవాంఛిత రోమాల్ని తొలగించుకోవడానికి కొంత మంది వ్యాక్స్ చేసుకుంటారు దీనికోసం వ్యాక్స్ స్ట్రిప్స్ వాడుతుంటారు. అయితే చర్మతత్వాన్ని బట్టి వ్యాక్స్ స్ట్రిప్స్ ఎంచుకోవడం ముఖ్యమని చెబుతున్నారు నిపుణులు. ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం చర్మం ఎరుపెక్కడం, దద్దుర్లు రావడంతో పాటు చర్మం మరింత సున్నితంగా మారుతుందట. ఫలితంగా ఎండలోకి వెళ్లినప్పుడు కందిపోవడం, ర్యాషెస్.. వంటి సమస్యలు వస్తాయట. అందుకే ఫేషియల్ వ్యాక్స్ ఎంచుకునే ముందు చర్మతత్వాన్ని పరిగణనలోకి తీసుకోవడం, ఇంట్లో తయారుచేసుకున్న వ్యాక్స్ అయినా.. బయటి నుంచి తెచ్చిన స్ట్రిప్ అయినా.. అప్లై చేసుకునే ముందు ఓసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.

