కలం, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర (Cylinder Price Hike) భారీగా పెరిగింది. 19 కిలోల సిలిండర్ పై రూ.195.50 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. గతనెల మార్చి 1వ తేదీన ఆయిల్ కంపెనీలు దీనిపై రూ. 115 ధర పెంచిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ధర పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర 2,078.50 రూపాయలుగా ఉంది. ఇక, బ్లాక్ మార్కెట్‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 10 వేల రూపాయల వరకు పలుకుతోంది. హైదరాబాద్ లో రూ.215 వరకు ధర పెరగనుంది. తాజా పెంపుతో హైదరాబాద్ లోకమర్షియల్ సిలిండర్ ధర రూ.2,321గా ఉండనుంది.
వంట గ్యాస్ ధరలపై (Cylinder Price Hike) పెంపు లేకపోవడంతో సామాన్య ప్రజలకు ఊరట లభించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియ్ కంపెనీలు ప్రతీ నెల 1వ తేదీన ఏటీఎఫ్, ఎల్పీజీ ధరల్లో మార్పులు చేస్తూ ఉంటాయి. దీనికి తోడుగా అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు సైతం తోడయ్యాయి. ఇందులో భాగంగానే కమర్షియల్ సిలిండర్ ధర పెరిగింది. ఈ ప్రభావంతో హోటల్ నిర్వాహకులు రేట్లు పెంచితే సామాన్యుడి జేబుకు చిల్లు పడినట్లేనని పలువురు భావిస్తున్నారు.
పశ్చిమాసియాలో జరుగుతున్న అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధ నేపథ్యంలో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల నుంచి చమురు ఎగుమతులు ఆగిపోతున్నాయి. ఫలితంగా ఇంధన కొరత ఏర్పడింది. ఈ క్రమంలోనే ధరలు సైతం పెరుగుతూ వస్తున్నాయి. అటు వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా విషయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిలిండర్ బుక్ చేసి 10 రోజులు అవుతున్నా.. గ్యాస్ సిలిండర్ డెలివరీ అవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంధన కొరతతో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటామోనని ప్రజలు భయపడుతున్నారు. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆయిల్ కంపెనీలు సైతం ప్రస్తుతం ఇంధన కొరత ఏమి లేదని.. ప్రజలు ఆందోళన చెందవద్ధని స్పష్టం చేసింది.
Read Also: పెరిగిన ఈవీ క్రేజ్.. కానీ అసలు సవాల్ ఇదే!
Follow Us On: X(Twitter)

