Mobile Popup Ad
Mobile Popup Ad

రైస్ మిల్లులకు ధాన్యం వెంటనే తరలించాలి: కలెక్టర్ కుష్బూ గుప్తా

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ (Collector) కుష్బూ గుప్తా (Khushboo Gupta) అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా మూసాపేట మండలంలోని వేముల గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ కుష్బూ గుప్తా, హైదరాబాద్ నుండి వచ్చిన పౌర సరఫరాల డైరెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అకాల వర్షాల వల్ల కొనుగోలు చేసిన ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని పీపీసీ సెంటర్ నిర్వాహకులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రంలో నింపి ఉన్న గన్నీ సంచులను మిల్లులకు ఎందుకు తరలించలేదని అధికారులను ప్రశ్నించారు. సరిపడా రవాణా వాహనాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఆలస్యం జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు.

దీని పై స్పందించిన కలెక్టర్ జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ రవి నాయక్, జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్‌లకు అదనపు లారీలను వెంటనే ఏర్పాటు చేసి ధాన్యం సంచులను తక్షణమే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే మిల్లుల వద్ద కూడా ధాన్యం సంచుల అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ట్రక్ షీట్ వివరాలను ఓపీఎంఎస్ యాప్‌లో ఆలస్యం చేయకుండా అప్‌లోడ్ చేయాలని సూచించారు. రైతులకు చెల్లింపులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మూసాపేట మండలంలో ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారని కలెక్టర్ ప్రశ్నించగా.. మండలంలోని నాలుగు కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 420 మంది రైతుల నుంచి 2,617.2 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. మరో మూడు నుంచి నాలుగు రోజుల్లో సుమారు 3,000 ధాన్యం బస్తాలు కొనుగోలు చేసే అవకాశం ఉందని వివరించారు. కార్యక్రమంలో ఎస్‌పీడీ జానకి, జిల్లా పౌర సరఫరాల సంస్థ డీఎం రవి నాయక్, జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్, మూసాపేట్ మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>