Mobile Popup Ad
Mobile Popup Ad

8 వేల‌ ఇందిరా గాంధీ స్త్రీ శ‌క్తి భ‌వ‌నాల‌కు సీఎం శంకుస్థాప‌న

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలంగాణ‌లో మ‌హిళ‌ల‌ను ఆర్థికంగా నిల‌బెట్టే ల‌క్ష్యంతో కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం మ‌రో కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల వేదికగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సచివాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో ఒకేసారి 8,000 ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మ‌హిళ‌ల‌ను ఆర్థికంగా నిల‌బెట్టే అద్భుత‌మైన కార్య‌క్ర‌మంగా 8,000 భ‌వ‌నాలకు ఒకే సారి శంకుస్థాప‌న చేస్తున్నామ‌ని, దేశంలోనే ఇది ఒక సంచ‌ల‌న నిర్ణ‌య‌మ‌ని పేర్కొన్నారు. తెలంగాణ ఆడ‌బిడ్డ‌ల ఆశీర్వాదంతో ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్ప‌డింద‌ని సీఎం అన్నారు. మ‌హిళ‌లు అభివృద్ధి సాధించిన‌ప్పుడే రాష్ట్రం ఆర్థికంగా నిల‌బ‌డుతుంద‌ని చెప్పారు. 2023 డిసెంబ‌ర్ 7న ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత రెండు రోజుల్లోనే ఆర్టీసీలో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం క‌ల్పించామ‌ని సీఎం గుర్తు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉచిత ప్రయాణం కోసం రూ.10 వేల కోట్లను ఆర్టీసీకి చెల్లించిన‌ట్లు తెలిపారు. మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం వ‌ద్ద‌ని కొంద‌రు రెచ్చ‌గొట్టార‌ని, అయితే మ‌హిళా అభ్యున్న‌తే రాష్ట్ర అభివృద్ధి అని భావించి ఉచిత బస్సు ప్ర‌యాణం ఇస్తున్నామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

జూన్ 5న 553 బ‌స్సులు ప్రారంభం

బ‌స్సుల‌కు మ‌హిళ‌ల‌ను య‌జ‌మానుల‌ను చేయాల‌ని 1000 బ‌స్సు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా చేశామ‌న్నారు. జూన్ 5న ప‌రేడ్ గ్రౌండ్ లో 553 బ‌స్సుల‌ను ప్రారంభించ‌బోతున్న‌ట్లు సీఎం తెలిపారు. సోలార్ ఎన‌ర్జీ అంటే అదానీ, అంబానీ గుర్తుకు వ‌స్తార‌ని, అలాంటిది రాష్ట్ర ప్ర‌భుత్వం 1000 మెగావాట్ల సోలార్ ఎన‌ర్టీ ప్లాంట్ల‌ను మ‌హిళా సంఘాల‌తో ఏర్పాటు చేయిస్తున్న‌ద‌ని తెలిపారు. రిల‌య‌న్స్ వాళ్లు చేసే పెట్రోల్ బంక్ వ్యాపారాన్ని మ‌హిళా స్వ‌యం స‌హాయ సంఘాల‌తో చేయిస్తున్నామ‌న్నారు. మారుమూల గ్రామాల్లోని మ‌హిళ‌లు ఆర్థికంగా నిల‌బ‌డాల‌న్న‌దే ప్ర‌భుత్వ ఉద్దేశ‌మ‌న్నారు. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు బ్యాంక్ లింకేజీ లోన్లను 10 ల‌క్ష‌ల‌కు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇప్పటి వ‌ర‌కు 60 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ లోన్లు అందించామ‌ని, సున్నా వ‌డ్డీ రుణాల కోసం ప్ర‌భుత్వం ఇప్ప‌టికే 1390 కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించింద‌ని సీఎం తెలిపారు. మ‌హిళ‌లు తీసుకున్న ప్ర‌తి రూపాయిని నిక్చ‌చ్చిగా చెల్లించి ముందుకు వెళ్తున్నార‌ని కొనియాడారు. లోన్లు తీసుకున్న వ్యాపారులు అప్పులు ఎగ్గొట్టి పారిపోతున్నార‌ని సీఎం ఆరోపించారు.

మ‌హిళా సంఘాల‌కు రైస్ మిల్లులు

మ‌హిళా సంఘాలు రైస్ మిల్లులు ఏర్పాటు చేసుకోవాల‌ని రేవంత్ రెడ్డి సూచించారు. మండలాల్లో గోడౌన్లు, లాస్టిక్ పార్కులు ఏర్పాటు చేసుకోవాల‌న్నారు. 100 ఎక‌రాల వ‌ర‌కు భూముల‌ను ఇవ్వ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని చెప్పారు. రైస్ మిల్లులు, గోడౌన్ల కోసం ప్ర‌భుత్వ భూముల‌ను కేటాయిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఆడ‌బిడ్డ‌లు ప్ర‌తి గింజ‌కు జ‌వాబుదారీగా ఉంటార‌ని చెప్పారు. ఇక ముందు మిల్లుల గోడౌన్ల‌లో ధాన్యం స్టాక్స్ పెట్టేది లేద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. స్వ‌యం స‌హాయ మ‌హిళా సంఘాలు వ‌డ్లు కొనుగోలు చేసి బియ్యం ప్ర‌భుత్వానికి. ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. రైస్ మిల్లులు, గోడౌన్ల ఏర్పాటు కోసం సున్నా వ‌డ్డీతో బ్యాంక్ లింకేజీ ఏర్పాటు చేసి కావాల్సిన రుణాల‌ను మంజూరు చేస్తామ‌న్నారు. మ‌హిళా సంఘాల‌తో మ‌హిళా శ‌క్తి సూప‌ర్ బ‌జార్లు కార్పొరేట్ త‌ర‌హాలో ఏర్పాటు చేయాల‌ని సీఎం సూచించారు. మ‌హిళా శ‌క్తి సూప‌ర్ బ‌జార్ల‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా వాటాదారుగా ఉంటుంద‌ని చెప్పారు. నాణ్య‌మైన వ‌స్తువుల కోసం మ‌హిళా శ‌క్తి సూప‌ర్ బ‌జార్ లో దొరికేలా ఏర్పాటు చేసుకోవాల‌న్నారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో సూప‌ర్ బ‌జార్ల కోసం ప్ర‌భుత్వ భూముల‌ను చాలా త‌క్కువ ధ‌రకు లీజుకు ఇస్తామ‌న్నారు. ఇవి దేశంలోనే బెస్ట్ సూప‌ర్ బ‌జార్లుగా త‌యారు కావాల‌ని సూచించారు. డీమార్ట్, బిగ్ బజార్‌ల‌ కంటే బెస్ట్‌గా మ‌హిళా శ‌క్తి సూప‌ర్ బ‌జార్లు ఉండాల‌న్నారు.

ఇక రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు అంద‌జేసిన చీర‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఆడ‌బిడ్డ‌కు సారెలా చీర‌లు అంద‌జేసింద‌ని సీఎం పేర్కొన్నారు. గ‌తంలో ఇచ్చిన చీర‌లు పంట పొలాల్లో పిట్ట‌ల‌ను కొట్ట‌డానికి ఉప‌యోగించార‌ని ఎద్దేవా చేశారు. ఇందిర‌మ్మ చీర‌ల‌తో పాల‌పిట్ట‌ల్లా ఆడ‌బిడ్డ‌లు క‌నిపిస్తున్నార‌ని, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో కూడా ఇందిర‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేస్తార‌ని సీఎం వెల్ల‌డించారు. చిలుక ప‌చ్చ రంగులో ఇందిర‌మ్మ చీర‌లు ఇవ్వ‌బోతున్నామ‌ని సీఎం వెల్ల‌డించారు. ఇక క‌విత, కేటీఆర్‌ల‌పై సీఎం రేవంత్ ప‌రోక్షంగా సెటైర్లు వేశారు. అన్న‌ద‌మ్ములు కొంద‌రు ఇంట్లో నుంచి చెల్లెళ్ల‌ను వెళ్ల‌గొడుతున్నార‌ని, ఈ మ‌ధ్య రాజ‌కీయాల్లో కొంద‌రు చెల్లెళ్ల‌ను బ‌య‌ట‌కు వెళ్ల‌గొడితే ఎలా శాప‌నార్థాలు పెడుతున్నారో చూస్తున్నామ‌ని సీఎం అన్నారు.

మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేయాల‌న్న ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం పని చేస్తుంద‌ని, ఈ ప్ర‌భుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే శ‌క్తి మ‌హిళ‌ల‌కే ఉంద‌ని సీఎం అన్నారు. 2034 నాటికి కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస‌ రెడ్డి, రాజ్య సభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణు గోపాల్, ఎమ్మెల్యేలు, మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల్ విజయ లక్ష్మి, వివిధ కార్పొరేషన్‌ల‌ చైర్మన్లు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిశోర్, ఎండోమెంట్స్ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, మహిళా, శిశు అభివృద్ధి, సామాజిక సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సెర్ప్ సీఈఓ దివ్య, మహిళా, శిశు అభివృద్ధి శాఖ డైరెక్టర్ శృతి ఓజా త‌దిత‌రులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>