కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రైతులు నాణ్యమైన, ధృవీకరించబడిన (సర్టిఫైడ్) విత్తనాలను మాత్రమే కొనుగోలు చేసి వినియోగించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ (Collector Khushboo Gupta) గుప్తా సూచించారు. నకిలీ విత్తనాలు, గడువు తేదీ ముగిసిన విత్తనాలు కొనుగోలు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, అక్రమాలకు పాల్పడే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
హన్వాడ (Hanwada) మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన విత్తన మేళాను (Seed Mela) కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే లక్ష్యంతో రైతు ముంగిట్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జిల్లాలోని రైతు వేదికలలో విత్తన మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ మేళాల ద్వారా రైతులకు నాణ్యమైన పంట విత్తనాలు, పప్పు దినుసుల విత్తనాలు, నూనె గింజల విత్తనాలు, కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అలాగే ఆధునిక వ్యవసాయ పద్ధతులకు అనుగుణంగా నానో యూరియా, నానో డీఏపీ ఎరువులను ప్రదర్శించి రైతులకు అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు. రైతులు యూరియాను మోతాదుకు మించి వాడకుండా నేల ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాణ్యమైన వ్యవసాయ విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు.
వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంతో పాటు రైతుల ఖర్చులను తగ్గించే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ తెలిపారు. పీఏసీఎస్‌ల (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు) ద్వారా కూడా ఎంపిక చేసిన రైతు వేదికల వద్దే ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో రైతులు గ్రామ స్థాయిలోనే విత్తనాలు, ఎరువులు పొందగలరని, సమయం, రవాణా ఖర్చులు ఆదా అవుతాయని పేర్కొన్నారు.
అనంతరం కూరగాయల సాగులో ఆధునిక పద్ధతులు, శాస్త్రీయ సూచనలు, వ్యాధి నివారణ చర్యలపై ఉద్యాన శాఖ రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని కలెక్టర్ (Collector Khushboo Gupta) ఆవిష్కరించారు. కూరగాయల సాగుపై రైతులు అవగాహన పెంచుకొని అధిక దిగుబడులు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, జిల్లా ఉద్యాన అధికారి వేణుగోపాల్, జిల్లా సహకార అధికారి కృష్ణ, తహశీల్దార్ కిష్టా నాయక్, ఎంపీడీఓ యశోదమ్మ తదితరులు పాల్గొన్నారు.
Read Also: హైదరాబాద్‌లో భారీ చోరీ.. ఏటీఎం క్యాష్‌తో వ్యాన్ డ్రైవర్ పరార్
Follow Us On: X(Twitter)

