Mobile Popup Ad
Mobile Popup Ad

బిల్లులు రాక మాజీ సర్పంచ్ ఆత్మహత్య

కలం, మెదక్ బ్యూరో: అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు సకాలంలో రాకపోవడం, పెరిగిన అప్పుల భారం ఓ మాజీ సర్పంచ్‌ను బలితీసుకుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ (Husnabad) మండలం మహమ్మదాపూర్ గ్రామంలో మంగళవారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక మహమ్మదాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ పిట్టల సంపత్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

​పిట్టల సంపత్ గతంలో మహమ్మదాపూర్ గ్రామ సర్పంచ్‌గా పదేళ్ల పాటు సేవలందించారు. తన పదవీ కాలంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం అనేక పనులు చేపట్టారు. ముఖ్యంగా ‘మిషన్ భగీరథ’ పథకానికి సంబంధించి దాదాపు 11 లక్షల రూపాయల బిల్లు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామంలో చేసిన పనులకు గాను సొంత డబ్బులు ఖర్చు పెట్టడం, బయట తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో సంపత్ గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆయన ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మృతుడికి భార్య, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.

​తమ తండ్రి మృతికి ప్రస్తుత గ్రామ పాలకవర్గ వైఖరే కారణమని మృతుడి పిల్లలు కన్నీరు మున్నీరవుతున్నారు.”మా నాన్న పదేళ్ల పాటు సర్పంచ్‌గా ఉండి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. గ్రామ పంచాయతీ పనులకు సంబంధించిన అన్ని బిల్లులు, రికార్డులు పక్కాగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రస్తుత గ్రామ పాలకవర్గం కావాలనే ఆ బిల్లులు పాస్ కాకుండా, చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. వారి వేధింపులు, వ్యవహార శైలి వల్లే మనస్తాపానికి గురై మా నాన్న ఆత్మహత్య చేసుకున్నారు” అని వారు ఆరోపించారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న తమ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read Also: హైదరాబాద్‌లో భారీ చోరీ.. ఏటీఎం క్యాష్‌తో వ్యాన్ డ్రైవర్ పరార్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>