కలం, కరీంనగర్ బ్యూరో: అందరం కలిసి మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలిద్దామని, కరీంనగర్ జిల్లాను ఇందులో ఆదర్శంగా నిలుపుదామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Collector Chitra Mishra ) పిలుపునిచ్చారు. దీనికోసం అన్ని శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, యువత, తల్లిదండ్రులు సమిష్టిగా మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేయాలన్నారు. గురువారం సాయంత్రం జిల్లాస్థాయి నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ ఈ పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని పాఠశాలలు విద్యాసంస్థల్లో విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.పోలీస్, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో డ్రగ్స్ వాడకంపై ఉక్కు పాదం మోపాలని సూచించారు. వైద్యుల చీటీ లేకుండా మత్తు కలిగించే మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, హాస్టళ్లు, కళాశాలలను సందర్శించి కేవలం డ్రగ్స్ పైనే కాకుండా మద్యపానం, ధూమపానం అనర్థాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో జిల్లా అగ్రస్థానంలో నిలిపేలా సమిష్టిగా కృషి చేద్దామని పేర్కొన్నారు.అనంతరం పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. డ్రగ్స్ అమ్మకాలు, వినియోగం, రవాణా వంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రెడీ చేయండి: కలెక్టర్
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన బ్యాలెన్స్ వర్క్స్ సత్వరమే పూర్తి చేసి ఇండ్లను సిద్ధం చేసి ఉంచాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం కరీంనగర్ లోని గాంధీ నగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బ్లాక్ లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇండ్లకు సంబంధించిన పెండింగ్ పనులు ఏమేమి ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యాలెన్స్ వర్క్ ను వెంటనే చేపట్టి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సిద్ధం చేసి ఉంచాలని ఆదేశించారు. ఈ పనులపై ఆర్ అండ్ బి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. బ్లాక్ ల వారీగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అన్ని రకాలుగా సంసిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరసింహ చారి, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

