కలం, వెబ్ డెస్క్: జైళ్లలో ఉన్న ఖైదీల ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Rajanarsimha) స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని చంచల్‌గూడ జైలులో ఏర్పాటు చేసిన 3 రోజుల మెడికల్ క్యాంపును (Medical Camps) గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ క్యాంపులో ఖైదీలకు హెచ్‌ఐవీ, టీబీ, ఇతర ఆరోగ్య పరీక్షలు చేసేందుకు ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి పౌరునికి మెరుగైన వైద్య సేవలు అందించి, వారి ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు.
ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా ఈరోజు రాష్ట్రవ్యాపంగా హెచ్‌ఐవీపై అవేర్‌నెస్ కార్యక్రమాలు, స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేశామని వివరించారు. ఇకపై ప్రతి 3 నెలలకు ఒకసారి జైళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్లు, అవసరమైన డయాగ్నసిస్ సర్వీసులతో కూడిన హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తెలంగాణ జైళ్లను ఆశ్రమాల తరహాలో నిర్వహిస్తున్న జైళ్ల శాఖ అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఆరోగ్యశాఖ, జైళ్ల శాఖ సమన్వయంతో పని చేస్తూ ఖైదీలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నాయని చెప్పారు.

