రేవంత్ సర్కార్‌తో పోరాడుతాం.. మీ భూములు కాపాడుతాం: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: రేవంత్ సర్కార్‌తో పోరాడుతామని.. గొల్లపల్లి బాధిత రైతుల భూములు కాపాడుతామని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) స్పష్టం చేశారు. వనపర్తి జిల్లాలోని ఏదుల మండలం గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్‌ (Gollapalli-Chirkapalli Reservoir)కు వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టిన రైతులకు హరీశ్ రావు సంఘీభావం తెలిపారు. రైతులకు నిమ్మ రసం ఇచ్చి నిరాహార దీక్షను విరమించేలా చేశారు. అనంతరం అక్కడ నిర్వహించిన సభలో హరీశ్ మాట్లాడుతూ.. అరవై ఏండ్లల్లో మొత్తం పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ కట్టిన రిజర్వాయర్ల కెపాసిటీ 25 టీఎంసీలు అయితే, తాము తొమ్మిది ఏండ్లల్లో 65 టీఎంసీల కెపాసిటీ గల రిజర్వాయర్లు నిర్మించామని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ మేజర్ పార్ట్ తాము పూర్తి చేశామని చెప్పారు. మిగిలిపోయిన చిన్న చిన్న పనులు పూర్తి చేయడం చేతకావడం లేదని రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు. మూడు సీజన్లు పోయాయని.. యాబై టీఎంసీలు నిలుపుకునే అవకాశం ఉండేదని చెప్పారు. అన్ని నీళ్ళు మన రిజర్వాయర్లలో ఉంటే మన పాలమూరు ఎట్లా ఉండేదని అడిగారు.

రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు.. పిల్లి

కాంగ్రెస్ నేతలు అనేక కేసులు వేసి ప్రాజెక్ట్ పనులకు అడ్డుకట్ట వేశారని హరీశ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు.. పిల్లి అని, కాలువ తీయడం చేతకావడం లేదంటూ దుయ్యబట్టారు. కేఎల్ఐలో వనపర్తి నియోజకవర్గం లేదని.. నిరంజన్ రెడ్డి ఒప్పించి వనపర్తికి నీళ్ళు ఇప్పించారని అన్నారు. గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ అవసరం లేదని.. ఏదుల నుండి నీళ్ళు పారుతాయని ఆనాడే చెప్పినామని గుర్తు చేశారు. కమిషన్ల కక్కుర్తి కోసం కాంగ్రెస్ నేతలు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయొద్దని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను జూరాల దగ్గర కట్టేది ఉండే అంటున్నారు.. బుద్ధి ఉన్న ఎవరైన అది కరెక్ట్ అంటారా? అని ప్రశ్నించారు. జూరాల ఆయకట్టు క్రాప్ హాలిడే అని.. కల్వకుర్తి లిఫ్ట్ ఇప్పటికీ నడుస్తుందని చెప్పారు.

నాలుగు రైతుబంధులు ఎగ్గొట్టాడు..

పాలమూరు జిల్లాను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతంగా ప్రగతి పథంలో నడిపిందని గుర్తు చేశారు. రెండున్నర ఏండ్లలో పదివేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినవా రేవంత్ రెడ్డి? అంటూ దుయ్యబట్టారు. వలసలు వాపస్ అని బీఆర్ఎస్ హయాంలో వార్తలు రాశారని.. పాలమూరు పచ్చని రంగు వేసుకున్నదని పేపర్లో హెడ్డింగ్‌లు వచ్చాయన్నారు. కేరళలోకు వెళ్లి ఆరు గ్యారెంటీలు అమలు చేశామని రేవంత్ అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. నాలుగు రైతుబంధులు ఎగ్గొట్టాడని.. ఒక్కసారి మాత్రమే పూర్తిగా ఇచ్చాడని అన్నారు. వనపర్తిలో ఏ ఊరికి అయినా వెళ్దామని.. రుణమాఫీ 100 శాతం పూర్తయితే తాను రాజీనామా చేస్తానని.. కాకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సంతకం వేసి ఇచ్చారని.. రెండున్నర ఏండ్లు అయితే ఇంకా ఆరు గ్యారెంటీలు అమలు చేయవా? అని ప్రశ్నించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>