కలం, కరీంనగర్ బ్యూరో: హైదరాబాద్ స్థాయిలో కరీంనగర్ (Karimnagar) జిల్లాలో యువతకు స్కిల్ డెవలప్‌మెంట్, ఉద్యోగ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Chitra Mishra) తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థను కేంద్రంగా చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు అవసరమైన అన్ని రకాల శిక్షణ అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవో మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో విద్యా రంగానికి అవసరమైన మౌలిక వసతులు, వనరులు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. ఉద్యోగ శిక్షణ కోసం యువత హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితిని తగ్గించేలా జిల్లాలోనే ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలతో సమన్వయం చేసుకుని గ్రంథాలయ సంస్థ ద్వారా ప్రత్యేక కోచింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. నిరుద్యోగ యువత, విద్యార్థులు జిల్లా గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించిన కలెక్టర్, పుస్తక పఠనం ద్వారా జ్ఞానం, వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందన్నారు. యువతలో రీడింగ్ కల్చర్ మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్.. మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి నగరపాలక సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. స్మార్ట్ సిటీ నిధులతో రూ.7 కోట్ల వ్యయంతో చేపట్టిన జిల్లా గ్రంథాలయానికి నూతన భవనం సిద్ధమైందని వెల్లడించారు. త్వరలోనే భవనాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏ అవసరం ఉన్నా తమను సంప్రదించవచ్చని సూచించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రంథాలయాలు జ్ఞానం, విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసానికి కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకొని పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు
గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ మాట్లాడుతూ.. చదువుకు మనిషి గౌరవాన్ని, ఆర్థిక స్థితిగతులను మార్చగల శక్తి ఉందని అన్నారు. గ్రంథాలయం నాలెడ్జ్ హబ్‌లా పనిచేస్తోందని, విద్యార్థులు, నిరుద్యోగులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రంథాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ.. పుస్తక పఠనం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని సూచించారు. తాను చదువుకునే రోజుల్లో నిత్యం పుస్తకాలు చదివేదాన్నని, వాటి ద్వారా ఎంతో జ్ఞానం పెరిగిందని చెప్పారు.
ఈ సందర్భంగా పలువురు గ్రంథాలయానికి పుస్తకాలను అందజేశారు. జిల్లా కలెక్టర్, మేయర్, సుడా చైర్మన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కలిసి పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. విద్యార్థుల సౌకర్యార్థం పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ వారు అందించిన 8 కూలర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓకే మహేశ్వర్ స్థానిక కార్పొరేటర్ పడాల శ్రీజ, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సరిత, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

