కలం, నిర్మల్ : ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలను మెరుగ్గా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అన్నారు. శుక్రవారం దిలవార్‌పూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో విద్యార్థులకు అందుతున్న వసతులు, సౌకర్యాలను పరిశీలించి, పాఠశాల హాజరు పట్టికను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సంఖ్యకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. పలు సబ్జెక్టులపై ప్రశ్నలు అడిగి వారి విద్యా నైపుణ్యాలను పరీక్షించారు. పుస్తక జ్ఞానంతో పాటు సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని, ప్రతి విషయాన్ని శ్రద్ధగా నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. వసతి గృహంలోని స్టోర్ రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్, నిల్వ ఉంచిన కూరగాయలు, వంట సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. సరుకులు వచ్చిన వెంటనే వాటి నాణ్యతను పరిశీలించి, నాణ్యమైన సరుకులను మాత్రమే వినియోగించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారమే ప్రతిరోజూ రుచికరమైన, పోషకాహార భోజనాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు. తనిఖీలో భాగంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ (Collector Bhavesh Mishra) మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం రుచి, నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, మండల ప్రత్యేక అధికారి (DRO) రాథోడ్ రమేష్, తహసీల్దార్ ఎజాజ్ అహ్మద్, ఉపాధ్యాయులు, సిబ్బంది, పాల్గొన్నారు.
Read Also: భట్టి, శ్రీధర్ బాబు, ప్రేమ్ సాగర్ రావు బందిపోట్లు: కవిత
Follow Us On: Instagram

