కలం, వెబ్‌డెస్క్: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) కోర్సుల కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ (Kaloji Health University) నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ యూజీ-2026లో అర్హత సాధించిన విద్యార్థులు ఆగస్టు 5 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 12 సాయంత్రం 6 గంటల వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు. దరఖాస్తు చేసుకునే ముందు విద్యార్థులు ప్రాస్పెక్టస్‌ను పూర్తిగా చదివి, అర్హతలు, రిజర్వేషన్లు, అవసరమైన ధ్రువపత్రాలను పరిశీలించుకోవాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
ఆన్లైన్ దరఖాస్తు సమయంలోనే విద్యార్థులు అన్ని సర్టిఫికెట్లను తప్పకుండా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నమోదు ప్రక్రియ ఒక్కసారి మాత్రమే ఉంటుందని, ప్రతి రౌండ్ కౌన్సెలింగ్‌కు మళ్లీ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్ జాబితా విడుదలవుతుందని, ఆ తర్వాత వెబ్ ఆప్షన్లు, కౌన్సెలింగ్ షెడ్యూల్, సీట్ల మ్యాట్రిక్స్‌ను ప్రకటిస్తామని తెలిపారు. వెబ్ ఆప్షన్లు నమోదు చేసేటప్పుడు విద్యార్థులు కళాశాలల ప్రాధాన్యత క్రమాన్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://tsmedadm.tsche.in ను సందర్శించాలని కోరారు.

