కలం, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ప్రేమ్ సాగర్ రావు బందిపోట్లు అంటూ తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. సింగరేణి ప్రాంత వనరులు, ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో కార్మికులు, కర్షకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. కల్లాల్లో వరి కుప్పల మీదనే గుండె ఆగి రైతుల ప్రాణాలు పోతున్నాయని చెప్పారు. అన్నదాతలకు రైతు భరోసా, యూరియా ఇవ్వడంతో ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పారు. కాంగ్రెస్ కు కచ్చితంగా రైతుల ఉసురు తగులుతుందని మండిపడ్డారు. కోల్ బెల్ట్ ప్రాంత లీడర్లు ప్రజల సమస్యలు పక్కన పెట్టి ఇసుక, మట్టి, బూడిద దందా చేస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ తీరుతో ప్రజలు విసిగిపోయారు..
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో ప్రజలు విసిగిపోయారని.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తామే ఎదగబోతున్నామని చెప్పారు. గత నాలుగు రోజులుగా బాయిబాట కార్యక్రమంలో భాగంగా చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల,ఆసిఫాబాద్, కాగజ్ నగర్, రామగుండం, మంథని లోని బొగ్గుబాయిలను సందర్శించామన్నారు. రేపు భూపాలపల్లిలో ఉన్న బొగ్గు బాయిని సందర్శిస్తామని చెప్పారు. నాలుగు రోజుల పాటు తాము అటు బొగ్గుగని కార్మికులు, ఇటు ప్రజల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నామని చెప్పారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలో తమ మొత్తం టూర్ సాగిందని వివరించారు.
శ్రీధర్ బాబు తమ్ముడు పెత్తనం చేలాయిస్తున్నాడు..
ఇక్కడ జిల్లా స్థాయిలో శ్రీధర్ బాబు, ప్రేమ్ సాగర్ రావు దోపిడికి పాల్పడుతున్నారని.. రాష్ట్ర స్థాయిలో వీరికి భట్టి విక్రమార్క తోడయ్యారని ఆరోపించారు. ఈ ముగ్గురు బందిపోటు దొంగలు ప్రజల సమస్యలను వదిలి అక్రమ సంపాదన మీద పడ్డారని ఫైర్ అయ్యారు. శ్రీధర్ బాబు విషయంలో ఆయన తమ్ముడు శ్రీను బాబు పెత్తనం చేలాయిస్తున్నాడని ఫైర్ అయ్యారు. భట్టి విక్రమార్క వాళ్ల కుటుంబ సభ్యులు అధికారులను, కాంట్రాక్టర్లను బెదిరిస్తూ లంచం అడుగుతున్నారని మండిపడ్డారు. బై వన్ గెట్ వన్ అన్నట్లుగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన పరిస్థితి తయారైందని చెప్పారు. ప్రజలను పట్టించుకోకుండా ఇసుక, మట్టి, బూడిద దందా చేస్తున్నారని అన్నారు.
దయనీయంగా రైతుల పరిస్థితి..
ఇప్పటికీ కూడా వడ్లు తీసుకుంటలేరని.. కల్లాల వద్దనే రైతులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్లు డిజిటర్ కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నారని విమర్శించారు. ఒకరితో ఒకరికి పడకపోవటంతో డిజిటల్ కేబినెట్ మీటింగ్ అని పెట్టుకున్నారని ఆరోపించారు. పైగా కేబినెట్ మీటింగ్ లో ఏడు రకాల వడ్లకే బోనస్ ఇస్తామని చెబుతున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికలకు ముందు మాత్రం దొడ్డు, సన్న అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు మాత్ర ఏడు రకాల వడ్లకు మాత్రమే అని అంటున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పాలసీ రెండు ఎకరాలకే ఇస్తారా?
యాసంగికి రెండు ఎకరాలకే రైతు భరోసా వేశారని.. వానాకాలం పంట రైతు భరోసా జులై 30 నాడు వేస్తారంట అంటూ దుయ్యబట్టారు. అసలు కాంగ్రెస్ పాలసీ రెండు ఎకరాలకే ఇస్తారా? అనేది చెప్పాలన్నారు. యూరియ యాప్ అని పెట్టి రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. యూరియ యాప్ ను రద్దు చేయాలని పెద్దపల్లి వేదికగా డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వంలో కార్మికులు, కర్షకులు, ఆడబిడ్డలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

