యూరియా కోసం రైతుల తిప్పలు.. ప్రభుత్వం స్పందించాలి: BSP

కలం, చండూరు(చౌటుప్పల్): యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో యూరియా ఎరువుల కొరత (Urea Shortage), యాప్ ఆధారిత పంపిణీ విధానం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జి ఐతరాజు అభయేందర్ అన్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం చౌటుప్పల్ ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలకు ప్రస్తుతం యూరియా అత్యవసరంగా అవసరమైన సమయంలో రైతులు ఎరువుల కోసం దుకాణాల చుట్టూ తిరుగుతున్నా, సరిపడా నిల్వలు లేక నిరాశతో వెనుదిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ ద్వారా మాత్రమే యూరియా బుకింగ్ తప్పనిసరి చేయడంతో సాంకేతిక పరిజ్ఞానం లేని రైతులు, వృద్ధులు, నిరక్షరాస్యులు, చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో యూరియా నిల్వలను అందుబాటులో ఉంచాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో రైతులు రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలపై వస్తున్న ఫిర్యాదులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే ప్రభుత్వం వెంటనే ఈ క్రింది చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి ఎరువుల దుకాణంలో తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉంచాలి. యాప్‌తో పాటు ఆఫ్‌లైన్ విధానంలో కూడా యూరియా పంపిణీ చేయాలి. బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలపై ప్రత్యేక విజిలెన్స్ బృందాలతో తనిఖీలు నిర్వహించాలి. రైతులు గంటల తరబడి క్యూలలో నిలబడకుండా టోకెన్ లేదా గ్రామాల వారీగా పంపిణీ వ్యవస్థ అమలు చేయాలి.

జిల్లాలోని ప్రతి మండలానికి అవసరమైన మేరకు అదనపు యూరియా నిల్వలను వెంటనే కేటాయించాలి. వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో ప్రత్యేక నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఎరువుల నిల్వలు, పంపిణీ వివరాలను ప్రతిరోజూ ప్రజలకు పారదర్శకంగా వెల్లడించాలి. రైతుల పంటలను కాపాడాలంటే యూరియా కొరతను వెంటనే నివారించి, ప్రతి అర్హ రైతుకు సకాలంలో ఎరువులు అందేలా ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా కార్యదర్శి కత్తుల పరమేష్, నియోజకవర్గ ఇన్‌చార్జి బొట్ట శివ, నియోజకవర్గ అధ్యక్షుడు తగరం శుభాష్ చంద్రబోస్, నియోజకవర్గ కోశాధికారి మాధ రమేష్, నారాయణపురం మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల గిరి, సీనియర్ నాయకులు ఎర్రోళ్ల వెంకటయ్య, కత్తుల నర్సింహ, కురిమిద్ద యాదయ్య, ఖైతాపురం శివ, రైతులు మల్లయ్య, శివయ్య, అబ్బయ్య, ఈశ్వరయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>