కలం, నిర్మల్: జిల్లాలోని రైతులందరూ తమ సాగు, పంటల వివరాలను క్రాప్ సర్వేలో (Crop Survey) తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ (Nirmal Collector) భవేష్ మిశ్రా (Bhavesh Mishra) సూచించారు. గురువారం సారంగాపూర్ మండలం గోపాల్‌పేట్ గ్రామ శివారులో పొలాల్లో కొనసాగుతున్న క్రాప్ సర్వే ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ.. పంటల వివరాలు క్రాప్ సర్వేలో సక్రమంగా నమోదైతే భవిష్యత్తులో ధాన్యం విక్రయాలు, ప్రభుత్వ పథకాల ద్వారా లభించే సహాయం, ఇతర వ్యవసాయ ప్రయోజనాలు పొందే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని తెలిపారు. రైతులు వ్యవసాయ శాఖ సిబ్బందికి సహకరించి తమ పంటల వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయించుకోవాలని సూచించారు.
క్రాప్ సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా వాస్తవ సాగు వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సర్వే సిబ్బంది తప్పనిసరిగా రైతుల సమక్షంలోనే పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవంగా సాగులో ఉన్న పంటల వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా క్రాప్ సర్వేను పూర్తి చేసేందుకు పదో తరగతి ఉత్తీర్ణులైన స్థానిక యువతను వాలంటీర్లుగా నియమించుకుని వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సర్వే ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ నమోదు ప్రక్రియలో పారదర్శకత, ఖచ్చితత్వం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సుజాత, ఎంపీఓ అజీజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

