కలం, నాగర్ కర్నూల్ : ఓటర్ ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR) ఓవైపు ఓటర్లకు మరోవైపు ఇతర కార్యకలాపాలు నిర్వహించుకోవాలనుకున్న ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు కల్పిస్తున్నాయి. రెండు నెలలుగా జరుగుతున్న ఓటరు ప్రత్యేక సవరణ ప్రక్రియలో రెవెన్యూ యంత్రాంగం తలమునకలై ఉండడంతో నాగర్ కర్నూల్ (Nagarkurnool) తహసీల్దార్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి.
సర్ ప్రక్రియ కారణంగా రెవెన్యూ అధికారులు ఓటర్ల ఇంటికి వెళ్తూ.. గ్రామాల్లో తిరుగుతున్నారు. ప్రతిరోజు ఇదే ప్రక్రియలో బిజీగా ఉండడంతో రెవెన్యూ ఇతర వ్యవహారాలు పెండింగ్లో ఉంటున్నాయి. ముఖ్యంగా భూముల రిజిస్ట్రేషన్లు, కుల, ఆదాయ, స్థానిక, ఇతర సర్టిఫికెట్ల కోసం ప్రజలు, విద్యార్థులు పనులు మానుకొని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కానీ అధికారులంతా సర్ ప్రక్రియ పేరు చెప్పి ఇతర పనులను గాలికి వదిలేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. నాగర్ కర్నూల్ తహసీల్దార్ కార్యాలయంలో ఇదే పరిస్థితి నెలకొంది.
గురువారం 12 గంటల సమయంలో కూడా పలు విభాగాల్లో ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. గిర్ధవార్, ఇతర సిబ్బంది సహా తహసిల్దార్ లేకపోవడంతో కార్యాలయంలో మొత్తంగా ఖాళీగానే ఉంది. ఉన్న ఒకరిద్దరు ఉద్యోగులు అక్కడ ఫోన్ నెంబర్ ఉంది చేయండి అని గుర్రుగా సమాధానం ఇస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. కొందరు ఫోన్లు చేసినా ఆ అధికారులు ఎత్తడం లేదని వాపోతున్నారు.
జిల్లా కేంద్రాల్లోని తహసిల్దార్ కార్యాలయంలోనే ఈ విధమైన పరిస్థితి ఉంటే మిగతా మారుమూల మండల కార్యాలయంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. నిత్యం వందల మందితో సందడిగా ఉండే కార్యాలయం అధికారుల తీరుతో నిర్మానుష్యంగా మారిపోయింది. ఈ విషయమై వివరణ కోరెందుకు ఫోన్లో ప్రయత్నించగా తహసీల్దార్ సైతం ఫోన్లో అందుబాటులోకి రాలేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి మధ్యాహ్నం తర్వాత అయినా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించేలా చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

