కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మంత్రివర్గ (Telangana Cabinet) విస్తరణ, ఖాళీ బెర్తుల భర్తీపై అటు ప్రభుత్వంలో, ఇటు కాంగ్రెస్ పార్టీలో ముమ్మరంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కీలకమైన మార్పులే జరగొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న గడ్డం ప్రసాద్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని, ఆ స్థానంలో మరొకరిని నియమించొచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి. గతంలో సైతం ఇదే చర్చ చోటుచేసుకున్నప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను స్పీకర్‌గా చేస్తారన్న అభిప్రాయాలూ వెలువడ్డాయి. డిప్యూటీ స్పీకర్‌గా దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్‌ను నియమించడంపైనా ఇటీవలే చర్చ జరిగింది.
అయితే రాబోయే రోజుల్లోని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని స్పీకర్ విషయంలో ఎవరిని నియమిస్తే ప్రయోజనకరంగా ఉంటుందో ఆలోచించి అవసరమైన మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశమున్నది. ఏది ఏమైనా స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ స్థానంలో కొత్తవారు రావడం ఖాయమనే అంశాన్ని అటు అసెంబ్లీ, ఇటు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్ 7న జరగబోయే అసెంబ్లీ సమావేశాలే స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కు చివరివని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
డిప్యూటీ స్పీకర్‌గా బాలూ నాయక్!
స్పీకర్ విషయంలో చర్చ కొలిక్కి రాకపోయినా డిప్యూటీ స్పీకర్ విషయంలో మాత్రం ముఖ్యమంత్రికి చాలా స్పష్టత ఉన్నదని, దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్ నియమితులయ్యే అవకాశముందని సమాచారం అందుతోంది. ఇటీవలే ఆయనను సీఎం పిలిపించుకుని, ఈ అంశం గురించి వివరించి, ఏ పరిస్థితుల్లో ఈ బాధ్యతలు అప్పజెప్పాల్సి వస్తున్నదో అర్థం చేయించినట్లు తెలిసింది. ఇప్పటికే డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రు నాయక్ పేరును సీఎం అధికారికంగా ప్రకటించినందున, ఆయనకు విప్ బాధ్యతలు కూడా ఉన్నందున బాలూ నాయక్‌ను నియమించడమే ఉత్తమమని సీఎం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
మంత్రివర్గం(Telangana Cabinet)లో చేరేందుకు బాలూ నాయక్ ఆసక్తి చూపించినా.. పార్టీ, ప్రభుత్వ అవసరాల దృష్ట్యా సీఎం చొరవ తీసుకుని ఆయనను డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టాలని ఒప్పించినట్లు సమాచారం. ఢిల్లీలో ఏఐసీసీ నేతలతో సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ సమయానికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశమున్నది. అవకాశాలు రానివారికి గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలన్న ప్రతిపాదన కూడా ఉన్నది.
Also Read : హైవే బాధితులకు ‘గోల్డెన్’ అభయం.. నకిరేకల్‌లో ‘100 పడకల’ సంజీవని!
Follow Us On: X(Twitter)

