కలం, నల్లగొండ బ్యూరో: హైదరాబాద్-విజయవాడ (ఎన్‌హెచ్-65) జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులను, నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని వందలాది గ్రామాల ప్రజలను దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ హైవేపై ప్రమాదాలు జరిగితే సరైన సమయంలో వైద్యం అందక బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు పెద్దాస్పత్రి (Nakrekal Hospital) అందుబాటులో లేక సరైన వైద్యం అందడం లేదు. ఇప్పుడు ఈ హైవేపై నకిరేకల్ టౌన్‌లో నిర్మించిన 100 బెడ్స్ హాస్పిటల్‌తో అటు హైవే ప్రయాణికులు, ఇటు నకిరేకల్ ప్రజల సమస్య పరిష్కారం కానుంది. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఈ ఆస్పత్రిని ఈ నెల 5న ప్రారంభించనున్నారు.
ఎన్‌హెచ్–65 హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నుంచి సూర్యాపేట జిల్లా కోదాడ వరకు సుమారు 180 కిలోమీటర్ల మేర విస్తరించింది. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే హైవేపై సూర్యాపేటలో మెడికల్ కాలేజీ మినహా అత్యవసర వైద్యమందించే పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి లేకపోవడంతో ఎంతోమంది బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. హైవేపై జరిగే రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మొదటి గంట(గోల్డెన్ అవర్) బాధితుడి ప్రాణాలు కాపాడేందుకు అత్యంత కీలకం.
కానీ ఈ హైవేపై నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లి ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను నల్లగొండ లేదంటే హైదరాబాద్ తరలించాల్సిన పరిస్థితి ఉన్నది. దీంతో మార్గమధ్యలోనే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ నకిరేకల్ టౌన్లో ఆధునిక వసతులతో 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి (Nakrekal Hospital) అందుబాటులోకి వచ్చింది. 24/7 ట్రామా కేర్, అధునాతన ఐసీయూ బెడ్లు, ఆర్థోపెడిక్ సర్జరీ విభాగాలు ఇక్కడ సిద్ధంగా ఉండటంతో క్షతగాత్రులకు తక్షణమే ప్రాణాలు కాపాడే అవకాశం కలిగింది.
ప్రభుత్వ విప్ వేముల వీరేశం ప్రత్యేక చొరవ
కొన్నాళ్లుగా మందకొడిగా సాగిన ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయడంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) ప్రత్యేక చొరవ చూపారు. నియోజకవర్గ ప్రజలతో పాటు హైవేపై వెళ్లే ప్రయాణికుల ప్రాణ రక్షణే ధ్యేయంగా ఆయన నిరంతరం పనులను సమీక్షించారు. సంబంధిత అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించి, నిధులు మంజూరు చేయించడమే కాకుండా నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూసి ఆస్పత్రిని శరవేగంగా అందుబాటులోకి తీసుకొచ్చారు.
కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు
హైవే ప్రమాద బాధితులకే కాకుండా, నకిరేకల్ పరిధిలోని వందలాది గ్రామాల ప్రజలకు ఆస్పత్రి (Nakrekal Hospital)లో కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందుతాయి. సాధారణ శస్త్రచికిత్సలతో పాటు ఎమర్జెన్సీ ఆపరేషన్లకు కూడా చేసే వెలుసుబాటు ఉంది. గర్భిణులకు సుఖ ప్రసవాలు, ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశువులకు ఐసీయూ సేవలు.. రోగ నిర్ధారణకు అత్యాధునిక డిజిటల్ ఎక్స్-రే, స్కాన్ యూనిట్లు, 24 గంటల పాథాలజీ ల్యాబ్ అందుబాటులోకి వస్తాయి.
రోగులతో పాటు వచ్చే సహాయకులకు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాగునీటి ప్లాంట్లు, వెయిటింగ్ హాళ్లు, విశాలమైన పార్కింగ్ వసతులు కల్పించారు. ఆస్పత్రి ప్రాంగణమంతా 24/7 సీసీ టీవీ నిఘా, అగ్నిమాపక భద్రతా వ్యవస్థలతో పాటు ప్రత్యేక సెక్యూరిటీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. భద్రతకు ఏమాత్రం లోటు రాకుండా చర్యలు చేపట్టారు.
నియోజకవర్గ ప్రజలకు తప్పిన బాధలు
నకిరేకల్ టౌన్ రూపురేఖలను మార్చేస్తూ, వందలాది మంది ప్రాణాలకు రక్షణ కవచంగా 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అత్యంత ఆధునిక వసతులతో రూపుదిద్దుకోవడం ప్రజా ప్రభుత్వ నిబద్ధత కు, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం దూరదృష్టికి నిదర్శనంగా నిలిచింది. ఇక నకిరేకల్ పరిసరాల్లోని 100కి పైగా గ్రామాల ప్రజలతో పాటు, హైవేపై ప్రయాణించే వాహనదారులకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందనుంది.
ఆస్పత్రి నిర్మాణంపై నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై సాధారణ వైద్యం కోసం నల్లగొండనో, హైదరాబాద్‌నో వెళ్లాల్సిన బాధలు తప్పుతాయని పేర్కొంటున్నారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయించిన ఎమ్మెల్యే వీరేశం కృషిని స్థానికులు, ప్రయాణికులు ప్రశంసిస్తున్నారు.
Also Read : తెలంగాణ కేబినెట్ విస్తరణ వేళ బిగ్ ట్విస్ట్.. స్పీకర్‌గా కొత్త ముఖం!
Follow Us On: X(Twitter)

