వైద్య సేవలు, ధాన్యం కొనుగోలు ప్రక్రియపై కలెక్టర్ ఆరా!

కలం, ఖమ్మం బ్యూరో: ​ప్రజలకు అందే వైద్య సేవల్లో నాణ్యత ఉండాలని, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankith) అధికారులను ఆదేశించారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా సుజాత నగర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ​ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, ఆసుపత్రిలోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

​రికార్డుల తనిఖీ, ఓపీ, ఐపీ, రిజిస్టర్లతో పాటు సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. అలాగే ల్యాబ్ సేవల పనితీరు, రక్త పరీక్షల ఫలితాలు రోగులకు సకాలంలో అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. మందుల నిల్వలను పరిశీలించి, అవసరమైన స్టాక్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. వార్డులు, మరుగుదొడ్లు నిరంతరం శుభ్రంగా ఉంచాలని, రోగులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని కలెక్టర్ సూచించారు.

​రైతు సమస్యలపై కలెక్టర్ సీరియస్

అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరుకున్న కలెక్టర్, అక్కడ కొనుగోలు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు. ​రైతులు రోజుల తరబడి కేంద్రాల వద్ద వేచి ఉండే పరిస్థితి రాకూడదన్నారు. ధాన్యం రాగానే వెంటనే తూకం వేసి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. మొక్కజొన్న తరలింపునకు లారీలు లేక ఇబ్బంది పడుతున్నామని రైతులు కలెక్టర్ దృష్టికి తేవడంతో తక్షణమే స్పందించిన ఆయన, రవాణా సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ‘పిన్ పాయింట్ డ్యామేజ్’ నెపంతో పీఆర్-126 రకం ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోవడం లేదని రైతులు వాపోయారు. దీనిపై మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కృష్ణ ప్రసాద్, ఎంపీడీవో భారతి, వైద్య అధికారులు డాక్టర్ రమేష్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>