ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) అధికారులను ఆదేశించారు. లారీలు మిల్లుల వద్ద ఎక్కువసేపు వేచి ఉండకుండా ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేసి వెంటనే ధాన్యం అన్‌లోడ్ చేయించాలని సూచించారు. బుధవారం వనపర్తి (Wanaparthy) కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కలెక్టర్ సంబంధిత అధికారులతో వరి ధాన్యం కొనుగోళ్లు, మిల్లుల వద్ద అన్‌లోడింగ్ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వానికి ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించడం అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. క్షేత్ర స్థాయిలో అలసత్వం ప్రదర్శిస్తే సహించబోమని హెచ్చరించారు. రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పని చేసి కొనుగోళ్లలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి మిల్లులో ఒక ప్రత్యేక అధికారిని నియమించి ధాన్యం అన్‌లోడ్ ప్రక్రియను పర్యవేక్షించాలని, లారీలు ఎక్కువసేపు నిలిపివేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కొన్ని మండలాలలో  మిల్లుల వద్ద లారీలు ఎక్కువగా వేచి ఉన్నట్లు సమాచారం వస్తోందని, వెంటనే అన్‌లోడింగ్ వేగవంతం చేయాలని సూచించారు. తహసీల్దార్‌లు, పోలీసు అధికారులు కొనుగోలు కేంద్రాలలో చురుకుగా వ్యవహరించాలని, మిల్లర్లు తరుగు పేరిట రైతులకు ఇబ్బందులు కలిగించకుండా చూడాలని తెలిపారు.

కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యంలో తాలు తొలగించేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన కొనుగోళ్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అవసరమైనన్ని లారీలు అందుబాటులో ఉండేలా ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లకు సూచించాలని, లారీల కొరత కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదనంగా హమాలీలను ఏర్పాటు చేసి మిల్లుల వద్ద అన్‌లోడింగ్ పనులు వేగంగా జరిగేలా చూడాలని తహసీల్దార్లకు ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, డీసీఎస్ఓ కాశీ విశ్వనాథ్, డీఆర్‌డీఓ ఉమాదేవి, డీసీఓ రాణి, డీటీఓ మానస తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>