కలం, మహబూబ్ నగర్ బ్యూరో : జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.
ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు, అధికారులకు, ఆహ్వానితులందరికీ ఆహ్వానాలు, అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేడుకల ప్రాంగణంలో తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా వివిధ శాఖల స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. వేడుకల ఏర్పాట్లలో ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా విజయవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.
జలసంచాయి.. జన్ బాగేదారి ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి :
జల సంచాయ్ జన్ భాగేదారి కార్యక్రమం కింద జిల్లాలో ఇప్పటి వరకు చేసిన పనుల ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం ఉదయం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులు జె.ఎస్.జె.బి, జాతీయ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్, ఉపాధి హామీ పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పడిన ప్రతి వర్షపు నీటి బొట్టును భూమిలో నిక్షిప్తం చేసి భూగర్భ జలాలు పెంచేవిధంగా కేంద్ర ప్రభుత్వం జె.ఎస్.జె.బి పథకాన్ని తీసుకురాగా జిల్లాలో ఇప్పటి వరకు 1.14 లక్షల పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. వాటన్నింటి ఫోటోలు తీసి ఆన్లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రేపు సాయంత్రం వరకు మాత్రమే సమయం మిగిలి ఉన్నందున యుద్ధప్రాతిపదికన ఫోటోలు అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ పథకం పై సమీక్ష నిర్వహిస్తూ జిల్లాలో నిరుపేద కుటుంబ యజమాని ఎవరైనా చనిపోతే ఈ స్కీమ్ ద్వారా కుటుంబానికి 20వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు.
జాతీయ ఉపాధి హామీ పథకం పై సమీక్షిస్తూ జిల్లాలో 100,602 యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయని వాటిలో ప్రతిరోజూ 40 శాతం లేబర్ కు పని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఇంకుడు గుంతలు మంజూరు చేయాలని, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, అన్ని ప్రభుత్వ భవనాలలో ఇంకుడు గుంతలు మంజూరు చేసి పనులు పూర్తి అయ్యేవిధంగా చూడాలన్నారు. ఈ సంవత్సరం వన మహోత్సవంలో భాగంగా సకాలంలో మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వించి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, జెడ్పి సిఈవో యాదయ్య, సిపిఓ హరికృష్ణ, ఆర్డీవో సుబ్రహ్మణ్యం ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

